AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India ODI Squad vs South Africa: హార్దిక్ రీ-ఎంట్రీ, అయ్యర్ ప్లేస్‌లో ఎవరు? సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే!

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ మొదలవ్వడానికి ఇంకో రెండు వారాల కన్నా తక్కువ సమయమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ త్వరలోనే వన్డే, టీ20 జట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత సొంత గడ్డపై వన్డేలు ఆడబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

India ODI Squad vs South Africa:  హార్దిక్ రీ-ఎంట్రీ, అయ్యర్ ప్లేస్‌లో ఎవరు? సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే!
Ind Vs Sa 1st Test
Rakesh
|

Updated on: Nov 17, 2025 | 4:02 PM

Share

India ODI Squad vs South Africa: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్ మొదలవ్వడానికి ఇంకో రెండు వారాల కన్నా తక్కువ సమయమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ త్వరలోనే వన్డే, టీ20 జట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ద్వారా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత సొంత గడ్డపై వన్డేలు ఆడబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా టూర్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆయన స్థానంలో ఎవరు వస్తారు, అలాగే స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

చాలా రోజుల తర్వాత హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి సౌతాఫ్రికా సిరీస్‌లో వన్డే, టీ20 ఫార్మాట్‌లలో ఆయన తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ టూర్‌లో గాయపడి, టెస్ట్ క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్.. వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకోవచ్చు.

భారత వన్డే జట్టులో ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రారంభిస్తారు. గిల్ సౌతాఫ్రికా టెస్టుకు గాయపడ్డా, వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడతారు. నాలుగో స్థానంలో ఆడే శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరమవ్వడంతో ఆయన స్థానంలో ఎవరు వస్తారనేది ఆసక్తికరం. నాలుగో స్థానానికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

జస్ప్రీత్ బుమ్రా సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో ఆడుతున్నందున, ఆయన వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కోసం వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకుని టీ20 సిరీస్‌లో తిరిగి వచ్చే అవకాశం ఉంది.

సౌతాఫ్రికాపై భారత్ సంభావ్య వన్డే జట్టు

బ్యాట్స్‌మెన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్.

వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్.

ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్.

బౌలర్లు: కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.

భారత్ vs సౌతాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న వన్డే సిరీస్ నవంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మొదటి వన్డే నవంబర్ 30న మధ్యాహ్నం 1:30 గంటలకు రాంచీలో జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే మ్యాచ్ డిసెంబర్ 3న అదే సమయానికి అంటే మధ్యాహ్నం 1:30 గంటలకు రాయ్‌పూర్ వేదికగా జరుగుతుంది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే డిసెంబర్ 6న మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖపట్నంలో జరగనుంది. మూడు మ్యాచ్‌లూ మధ్యాహ్నం 1:30 గంటలకే మొదలవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..