
Rishabh Pant: మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ -బ్యాటర్ రిషబ్ పంత్‌కు గాయమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తుండగా అతని కుడి పాదానికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, ఈ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్ డేట్ ఇచ్చింది. పంత్‌కు గాయం తీవ్రంగా ఉన్నప్పటికీ, జట్టు అవసరాల మేరకు అతను బ్యాటింగ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టు తొలి రోజు ఆటలో రిషబ్ పంత్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి బంతిని మిస్ అయ్యాడు. బంతి నేరుగా అతని కుడి పాదానికి బలంగా తగిలింది. దీంతో తీవ్రమైన నొప్పితో పంత్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికీ, నొప్పి తగ్గకపోవడంతో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు తిరిగి వెళ్ళాడు. ఆ సమయంలో పంత్ 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు. నడవలేని స్థితిలో ఉన్న పంత్‌ను మెడికల్ కార్ట్‌లో తీసుకెళ్ళాల్సి వచ్చింది.
గాయం తీవ్రతపై వెంటనే పంత్‌కు స్కానింగ్‌లు నిర్వహించారు. బీసీసీఐ అందించిన తాజా సమాచారం ప్రకారం, పంత్ ఈ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ విధులు నిర్వహించడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేస్తాడు. అయితే, జట్టుకు అవసరమైతే పంత్ బ్యాటింగ్ చేయడానికి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. గాయం ఉన్నప్పటికీ, పంత్ రెండవ రోజు జట్టుతో కలిశాడు.
ఈ సిరీస్‌లో పంత్‌కు గాయమవడం ఇది రెండోసారి. లార్డ్స్‌లో జరిగిన గత టెస్టులో అతని వేలికి గాయం కావడంతో వికెట్ కీపింగ్ విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు. అయితే, ఆ మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్ చేశాడు.
ఈ టెస్టు సిరీస్‌లో పంత్ కీలకమైన ఆటగాడిగా నిరూపించుకున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలతో కలిపి 462 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్‌కు అతను ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సిరీస్ లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది కాబట్టి, భారత్ ఈ మ్యాచ్ ను గెలవడం తప్పనిసరి. ఇలాంటి కీలక సమయంలో పంత్‌కు గాయం కావడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. అయితే, అతను బ్యాటింగ్‌కు అందుబాటులో ఉంటాడనే వార్త భారత అభిమానులకు కొంత ఊరటనిస్తుంది. పంత్ త్వరగా కోలుకోవాలని, పూర్తి ఫిట్ నెస్ తో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..