Team India: అందుకే టీమిండియా నుంచి శాంసన్ ఔట్.. పంత్‌కే ఎక్కువ ఛాన్స్‌లు.. ఇదిగో 5 కారణాలు
సంజూ శాంసన్ వన్డేలలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. అసలు ఎందుకు శాంసన్ కంటే పంత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో.. ఆ 5 కారణాలు ఇదిగో..?
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లోని మొదటి వన్డేలో సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. బ్యాట్‌తో ఫర్వాలేదనిపించినా.. అతడికి రెండో వన్డేలో అవకాశం ఇవ్వలేదు. దీంతో ఒక్కసారిగా టీమిండియా మేనేజ్‌మెంట్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. అదే సమయంలో, దీనికి ముందు అతడికి టీ20 ప్రపంచకప్‌లో కూడా చోటు దక్కలేదు. ఇప్పటిదాకా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు తక్కువ అవకాశాలు వస్తే.. మరోవైపు రిషబ్ పంత్‌కు సెలక్టర్లు బోలెడన్ని ఛాన్స్‌లు ఇస్తున్నారు. సంజూ శాంసన్ కంటే కోచ్, కెప్టెన్ రిషబ్ పంత్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సంజూ శాంసన్ వన్డేలలో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. అసలు ఎందుకు శాంసన్ కంటే పంత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో.. ఆ 5 కారణాలు ఇదిగో..?
టెస్టులు కారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అవకాశం.?
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఫార్మాట్ టెస్ట్‌లు. అందులో రిషబ్ పంత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ ఎడమ చేతి వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ 31 టెస్టుల్లో 5 సెంచరీలతో 2123 పరుగులు చేశాడు. తక్కువ మ్యాచ్‌లలోనే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్‌లపై పంత్ సెంచరీలు బాదాడు. అలాగే టీమిండియాకు విజయాలను అందించడంలో పలు చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ టెస్టు ప్రదర్శనలే.. పంత్‌కు వన్డే, టీ20 ఫార్మాట్‌లలో ఎక్కువ అవకాశాలను తెచ్చిపెడుతోంది.
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా పంత్‌కు ప్రయోజనం..
భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి చాలామంది బ్యాట్స్‌మెన్లు కుడి చేతితో బ్యాటింగ్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో, కెప్టెన్ సరైన జట్టు కాంబినేషన్ కోసం రిషబ్ పంత్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం ఇస్తాడు. సంజూ శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్. అటు లెఫ్ట్, రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌లు క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడవచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన.
విధ్వంసకర బ్యాటర్:
రిషబ్ పంత్ 2017లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అతడొక విధ్వంసకర బ్యాటర్‌గా పేరుగాంచాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ పంత్ ఈ విషయాన్ని నిరూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో సూపర్ ఫాస్ట్‌గా 89 పరుగులు చేసి టీమ్ ఇండియాకు టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌లోనూ అద్భుత సెంచరీ సాధించాడు. ఆరంభంలో వచ్చిన అవకాశాలను పంత్ సద్వినియోగం చేసుకున్నాడు. టీమ్ ఇండియా క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడల్లా పంత్ వచ్చి మెరుపు బ్యాటింగ్‌తో రక్షించేవాడు. మరోవైపు, సంజూ శాంసన్ 2015 సంవత్సరంలో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు, కానీ అతడి ఫామ్ లేమి కారణంగా టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.
పంత్ ‘X’ ఫ్యాక్టర్:
పరిస్థితులు ఎలా ఉన్నా? రిషబ్ పంత్ తన దూకుడు బ్యాటింగ్‌తో రాజీ పడలేదు. క్రీజులోకి రాగానే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోతాడు. తద్వారా అతడ్ని కోచ్, కెప్టెన్ ఎల్లప్పుడూ టీమ్ ఇండియా ‘X’ ఫ్యాక్టర్‌గా పరిగణిస్తారు. తరచుగా ప్రత్యర్థి జట్లు అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తాయి. ఎందుకంటే పంత్ క్రీజులో కొనసాగితే, అతడు ప్రత్యర్థిని ఓటమిపాలయ్యేలా చేస్తాడు.
పంత్ వికెట్ కీపింగ్ నైపుణ్యం:
ప్రపంచంలోని అత్యుత్తమైన వికెట్ కీపర్ కాదు గానీ.. అరంగేట్రం చేసిన తర్వాత నుంచి పంత్ తన వికెట్ కీపింగ్ నైపుణ్యాన్ని మేరుగుపరుచుకుంటూ వస్తున్నాడు. వృద్ధిమాన్ సాహాకు బదులుగా పంత్‌కు అవకాశం ఇచ్చినప్పుడు, మొదటిగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వికెట్ కీపింగ్‌పై ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆ తర్వాత, పంత్ వికెట్ కీపింగ్‌లో చాలా కష్టపడ్డాడు.
కాగా, ఇవన్నీ అటుంచితే.. సంజూ శాంసన్ కూడా వికెట్ కీపరేనని.. అతడికి అవకాశాలు ఇస్తే.. చక్కగా రాణించగలుగుతాడని అభిమానులు అంటున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ తప్పితే.. మిగతా అన్నింటిలోనూ పంత్‌కు శాంసన్ గట్టి పోటీ ఇస్తాడని చెబుతున్నారు. జట్టు కూర్పు విషయంలోనైనా, ఎవరినైనా తప్పించాలన్నా మొదటిగా శాంసన్ పేరు వస్తుండటం చాలా బాధాకరమని ఇప్పటికే పలువురు భారత మాజీ ప్లేయర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..