IPL 2023: ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తిరిగి ఆడేందుకు చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో రోజుకో వార్త రిషబ్ పంత్ ఆరోగ్యంపై వస్తూనే ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఐపీఎల్‌కు ముందు రిషబ్ పంత్‌ను భర్తీ చేయడం గంగూలీకి కష్టతరమైన సవాళ్లలో ఒకటిగా నిలిచింది. కారు ప్రమాదంలో గాయపడి, ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే, అందుబాటులోకి రావడం చాలా కష్టంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో అతని స్థానంలో ఎవరు ఉంటారనేది సందిగ్ధంగా నిలిచింది. ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని గంగూలీ అన్నాడు. ఈ మేరకు త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
గంగూలీ మాట్లాడుతూ, “నేను పంత్‌తో చాలాసార్లు మాట్లాడాను. అతను గాయాలు, శస్త్రచికిత్సల తర్వాత చాలా కష్టతరమైన సమయాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఒకటి లేదా రెండేళ్ల తర్వాత మళ్లీ భారత్ తరపున ఆడతాడు’ అంటూ అసలు మ్యాటర్ చెప్పేశాడు.
పంత్ ఐపీఎల్ సమయంలో జట్టుతో కొంత సమయం చూడాలనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. “నాకు తెలియదు. మనం చుద్దాం. తెలుసుకోవడానికి మాకు మరికొంత సమయం కావాలి. ఐపీఎల్‌కు ముందు తదుపరి శిబిరం ప్రారంభం కానుంది. ఐపీఎల్‌కు కేవలం ఒక నెల మాత్రమే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
రిషబ్ పంత్ స్థానాన్ని ఢిల్లీ జట్టు ఇంకా ప్రకటించలేదని గంగూలీ అన్నాడు. యువ ఆటగాడు అభిషేక్ పోరెల్, వెటరన్ షెల్డన్ జాక్సన్ మధ్య ఎవరు బెటర్ అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉండే అవకాశం ఉంది.
గంగూలీ మార్గదర్శకత్వంలో కోల్‌కతాలో మూడు రోజుల శిబిరం నిర్వహించారు. ఇందులో పృథ్వీ షా, ఇషాంత్ శర్మ, చేతన్ సకారియా, మనీష్ పాండే, ఇతర దేశీయ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ, ”ఐపీఎల్‌కు ఇంకా ఒక నెల సమయం ఉంది. సీజన్ ఇప్పుడే ప్రారంభమైంది. వారు ఆడే క్రికెట్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆటగాళ్లందరినీ ఒకచోట చేర్చడం కష్టం. నలుగురైదుగురు ఆటగాళ్లు ఇరానీ ట్రోఫీ ఆడుతున్నారు. సర్ఫరాజ్ వేలికి గాయమైంది. అతని వేలు విరిగిపోలేదు. ఐపీఎల్ నాటికి అతడు కోలుకుంటాడని ఆశిస్తున్నా’ అని తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..