UP T20 League 2026: 8 ఓవర్ల మ్యాచ్‌లో ఊచకోత.. 414 స్ట్రైక్ రేట్‌తో మ్యాచ్ ఖతం చేసిన భారత స్టార్

UP T20 League 2026: యూపీ టీ20 లీగ్ 2026లో రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన 8 ఓవర్ల మ్యాచ్‌లో కేవలం 7 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు బాదాడు. 414.29 స్ట్రైక్ రేట్‌తో మ్యాచ్‌ను ముగించి మీరట్ మావెరిక్స్‌కు ఘన విజయం అందించాడు. దీంతో మీరట్ వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది.

UP T20 League 2026: 8 ఓవర్ల మ్యాచ్‌లో ఊచకోత.. 414 స్ట్రైక్ రేట్‌తో మ్యాచ్ ఖతం చేసిన భారత స్టార్
Rinku Singh

Updated on: Aug 25, 2026 | 7:50 AM

UP T20 League 2026: యూపీ టీ20 లీగ్ 2026లో టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్ హోదాలో బరిలోకి దిగిన రింకూ సింగ్ 414.29 మైండ్ బ్లాకింగ్ స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 7 బంతుల్లోనే సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ 29 పరుగులు చేసి తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. యూపీ టీ20 లీగ్‌లో భాగంగా మీరట్ మావెరిక్స్, గోరఖ్‌పూర్ లయన్స్ మధ్య జరిగిన 16వ మ్యాచ్‌కు వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది. దీంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను చెరో 8 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్యన్ జుయల్ సారథ్యంలోని గోరఖ్‌పూర్ లయన్స్ నిర్ణీత 8 ఓవర్లలో 91 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 92 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్ మావెరిక్స్ కేవలం 6.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.

7 బంతుల్లోనే మ్యాచ్ చిత్రాన్ని మార్చేసిన రింకూ సింగ్

చేజింగ్ సమయంలో మీరట్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతి తర్వాత ఓపెనర్ అక్షయ్ దూబే గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ క్లిష్ట సమయంలో కెప్టెన్ రింకూ సింగ్ క్రీజులోకి అడుగుపెట్టాడు. చివరి 3 ఓవర్లలో మీరట్ గెలుపునకు 36 పరుగులు అవసరమయ్యాయి. విశాల్ నిషాద్ వేసిన ఆరో ఓవర్‌లో రింకూ సింగ్ శివతాండవం చేశాడు. వరుసగా 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాది ఒక్క ఓవర్లోనే ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు స్వాస్తిక్ చికారా 24 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సహకరించగా.. రింకూ కేవలం 7 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు.

ఇది కూడా చదవండి: Most Sixes: టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన ఏడుగురు విధ్వంసకర బ్యాటర్లు వీరే

జీషాన్ అన్సారీ మ్యాజిక్ స్పెల్

అంతకుముందు గోరఖ్‌పూర్ లయన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 5 ఓవర్లలో 63 పరుగులు చేసి 100 పరుగుల మార్కును అందుకునేలా కనిపించింది. ఆ దశలో మీరట్ బౌలర్ జీషాన్ అన్సారీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆరో ఓవర్‌లో ఆర్యన్ జుయల్, హర్దీప్ సింగ్ వికెట్లను ఒకే ఓవర్లో తీసి గోరఖ్‌పూర్ జట్టుకు డబుల్ షాక్ ఇచ్చాడు. జీషాన్ తను వేసిన 2 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

ఇది కూడా చదవండి: Video: బౌలింగ్ వేస్తున్నావా.. బుల్లెట్ పేలుస్తున్నావా? 153.6 KMPH స్పీడ్‌తో రెచ్చిపోయిన భారత బౌలర్

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో మీరట్

రింకూ సింగ్ సారథ్యంలోని మీరట్ మావెరిక్స్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా దూసుకుపోతోంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న లక్నో ఫాల్కన్స్ 6 మ్యాచ్‌లలో కేవలం 6 పాయింట్లు మాత్రమే సాధించడాన్ని బట్టి చూస్తే లీగ్‌లో మీరట్ మావెరిక్స్ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ కెప్టెన్ రింకూ సింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో మీరట్ మావెరిక్స్ టోర్నమెంట్‌లో ట్రోఫీ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే మ్యాచ్‌ల్లోనూ రింకూ నుంచి ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌లే అభిమానులు ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us