Vaibhav Suryavanshi: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు.. అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ విధ్వంసం..!

Vaibhav Suryavanshi Record: వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో టీమ్ ఇండియాకు మరో స్టార్ ఓపెనర్ దొరికినట్లే అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2025 వేలంలో కూడా రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Vaibhav Suryavanshi: విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు.. అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ విధ్వంసం..!
Virat Kohli Vs Vaibhav Suryavanshi

Updated on: Jan 18, 2026 | 8:07 AM

Vaibhav Suryavanshi Half Century: భారత క్రికెట్‌లో మరో అద్భుత ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అండర్-19 ప్రపంచకప్ 2026లో తన బ్యాట్‌తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, సాక్షాత్తూ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక కీలకమైన రికార్డును అధిగమించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

అండర్-19 ప్రపంచకప్ గ్రూప్-Aలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం ప్రదర్శించాడు. జింబాబ్వేలోని బులావాయో వేదికగా జరిగిన ఈ పోరులో టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన వైభవ్, కేవలం 67 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. కేవలం 30 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసి, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ వయసులో 50+ స్కోరు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

విరాట్ కోహ్లీ రికార్డు బద్ధలు..

ఈ మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు చేయగానే వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేలలో విరాట్ కోహ్లీ చేసిన పరుగుల రికార్డును అధిగమించాడు. విరాట్ కోహ్లీ తన యూత్ వన్డే కెరీర్‌లో 28 మ్యాచ్‌లాడి 978 పరుగులు చేయగా, వైభవ్ కేవలం 20 మ్యాచ్‌ల్లోనే 1000 పరుగుల మైలురాయిని దాటేశాడు. తద్వారా యూత్ వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఏడో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం వైభవ్ పేరిట 3 సెంచరీలు, 5 అర్ధశతకాలు ఉన్నాయి.

వరల్డ్ రికార్డు దిశగా అడుగులు..

ప్రస్తుతం యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు బంగ్లాదేశ్‌కు చెందిన నజ్ముల్ హుస్సేన్ శాంటో (1820 పరుగులు) పేరిట ఉంది. వైభవ్ వయసు కేవలం 14 ఏళ్లే కావడం, ఇంకా అతని ముందు చాలా అండర్-19 మ్యాచ్‌లు ఉండటంతో ఈ వరల్డ్ రికార్డును కూడా అతను అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి వైభవ్‌కు ఇంకా 773 పరుగులు కావాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..