Raksha Bandhan Special: ఆ ఇద్దరు అక్కల త్యాగమే టీమిండియాను మార్చేసింది.. 936 వికెట్లు, 8751 పరుగుల వెనుక ఉన్న కన్నీటి కథ

Raksha Bandhan Special: రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ క్రికెట్ కెరీర్ వెనుక వారి అక్కల త్యాగాలు, పోరాటం ఉన్నాయి. భువీని క్రికెట్ వైపు నడిపించిన రేఖా అడానా, తల్లి మరణం తర్వాత జడేజాకు అండగా నిలిచిన నయనా జడేజా జీవితాలు స్ఫూర్తిదాయకం. రక్షాబంధన్ సందర్భంగా ఈ ఇద్దరు అక్కల ప్రేమ, త్యాగం, ప్రోత్సాహం భారత క్రికెట్‌కు అందించిన గొప్ప విజయాలను గుర్తుచేస్తున్నాయి.

Raksha Bandhan Special: ఆ ఇద్దరు అక్కల త్యాగమే టీమిండియాను మార్చేసింది.. 936 వికెట్లు, 8751 పరుగుల వెనుక ఉన్న కన్నీటి కథ
Ravindra Jadeja

Updated on: Aug 28, 2026 | 1:02 PM

Raksha Bandhan Special: రక్షాబంధన్ పండగ వేళ సోదర సోదరీమణుల ప్రేమానురాగాలను గుర్తు చేసుకునేటప్పుడు భారత క్రికెట్ దిగ్గజాలు రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ జీవితాల్లో వారి అక్కలు చేసిన త్యాగాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో కలిసి 936 వికెట్లు పడగొట్టి, 8751 పరుగులు సాధించిన ఈ ఇద్దరు స్టార్ల కెరీర్ వెనుక వారి సోదరీమణుల వీరోచిత పోరాటం దాగి ఉంది.

భువీని స్వింగ్ సుల్తాన్‌గా మార్చిన అక్క రేఖా అడానా

మీరట్‌లోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన భువనేశ్వర్ కుమార్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేసేవారు. కొడుకుని సైన్యంలోకి పంపి దేశసేవ చేయించాలని ఆయన భావించారు. కఠినమైన క్రమశిక్షణ ఉన్న ఆ ఇంట్లో భువీలోని అద్భుతమైన బౌలింగ్ ప్రతిభను ఆయన అక్క రేఖా అడానా గుర్తించారు. భువనేశ్వర్‌కు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అక్క స్వయంగా చేయి పట్టుకుని మీరట్‌లోని చారిత్రాత్మక విక్టోరియా పార్క్ గ్రౌండ్‌కు తీసుకెళ్లారు. అక్కడ కోచ్‌లు విపిన్ వత్స, సంజయ్ రస్తోగీలతో మాట్లాడి ట్రైనింగ్ ఇప్పించారు. క్రికెట్ ఆడేందుకు తండ్రిని ఒప్పించడంలో అక్క ప్రధాన పాత్ర పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో తాను సాధించిన 294 వికెట్లు, 1171 పరుగుల ఘనత అంతా అక్క పట్టుదలేనని భువీ ఎప్పుడూ చెబుతుంటారు.

తల్లి మరణించిన వేళ జడేజాకు ధైర్యంగా నిలిచిన నయనా

రవీంద్ర జడేజా జీవిత ప్రయాణం తీవ్ర కష్టాలతో సాగింది. తండ్రి అనిరుద్ధసింహ జడేజా కొడుకుని సైనిక్ స్కూల్‌కు పంపాలని అనుకున్నా, తల్లి లతా జడేజా క్రికెట్ వైపు పంపించారు. జడేజాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదంలో తల్లి కన్నుమూశారు. ఆ చేదు నిజం తట్టుకోలేక జడేజా క్రికెట్‌ను శాశ్వతంగా వదిలేయాలని నిర్ణయించుకున్నారు. అలాంటి నాజూకైన సమయంలో పెద్ద అక్క నయనా జడేజా కుటుంబాన్ని, తమ్ముడిని దగ్గరుండి చూసుకున్నారు.

నర్స్ ఉద్యోగం చేస్తూ తమ్ముడిని గెలిపించిన సోదరి

తల్లి లేని లోటు తెలియకుండా, తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా నయనా నర్స్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించారు. తల్లి మరణించిన 12వ రోజునే బిసిసిఐ నుంచి అండర్-19 నేషనల్ క్యాంప్ పిలుపు లేఖ వచ్చింది. ఆ సమయంలో కన్నీళ్లను దిగమింగుకుని జడేజాకు ధైర్యాన్ని నూరిపోసి క్యాంప్‌నకు పంపించారు. అక్క ఇచ్చిన ఆత్మవిశ్వాసంతోనే జడేజా మైదానంలోకి అడుగుపెట్టారు. నేడు భారత్ తరఫున 642 వికెట్లు, 7580 పరుగులు సాధించి ఆధునిక క్రికెట్‌లో ప్రపంచ అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా వెలుగుతున్నారు.

క్రీడారంగంలో నిలిచిపోయే అనుబంధం

ఈ ఇద్దరు అక్కల ప్రోత్సాహం లేకపోతే భారత క్రికెట్‌కు ఇద్దరు గొప్ప మ్యాచ్ విన్నర్లు దక్కేవారు కారు. స్వార్థం లేని ప్రేమానురాగాలు, త్యాగాలకు వీరిద్దరి జీవితాలే నిదర్శనంగా నిలుస్తాయి. పండగ రోజు మాత్రమే కాకుండా జీవితాంతం గుర్తుంచుకోదగిన గొప్ప ప్రయాణం వీరిది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us