Anvay Dravid – Aaryavir Sehwag: భారత క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌లకు ఎంతో పేరుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ను ది వాల్ అని పిలిచేవారు. ద్రవిడ్ క్రీజులోకి వస్తే.. అతడిని ఔట్ చేయడం కష్టమయ్యేది. అయితే, సెహ్వాగ్ తన తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా రోజులైంది. అయితే భారత దేశవాళీ టోర్నీలో మళ్లీ ద్రవిడ్, సెహ్వాగ్ మధ్య పోరు కనిపిస్తోంది. ఈ యుద్ధం వీరిద్దరి ఇద్దరు కొడుకుల మధ్య కావడం గమనార్హం.
విజయ్ మర్చంట్ ట్రోఫీ ప్రస్తుతం భారతదేశంలో నిర్వహిస్తున్నారు. ఈ అండర్-16 టోర్నీలో ఢిల్లీతో కర్ణాటక తలపడింది. రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఢిల్లీ తరపున ఆడుతున్నాడు.
మూడు రోజుల మ్యాచ్‌లో తొలి రోజు బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు 56.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ఈ ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అతడిని ఆయుష్ లక్రా అవుట్ చేశాడు. రెండు బంతులు ఆడి ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. అయితే, ఓపెనింగ్‌లోనే సెహ్వాగ్ తనయుడు అర్ధ సెంచరీ చేశాడు. తొలిరోజు 50 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా, ఢిల్లీ జట్టు కర్ణాటకపై బలమైన ఆధిక్యం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్యవీర్, అన్వయ్ మధ్య జరిగిన పోరులో ఇప్పటి వరకు ఆర్యవీర్ డామినేట్ చేస్తూ వస్తున్నాడు. రెండో రోజు ఆర్యవీర్ ఔట్ అయ్యాడు. ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌తో 54 పరుగులు చేశాడు.
వీరిద్దరి కంటే ముందు గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్నాడు. అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇప్పుడు ద్రావిడ్, సెహ్వాగ్‌ల కుమారులు కూడా తమ ఆటతో వార్తల్లో నిలిచారు. ఇటీవల, ద్రవిడ్ ప్రపంచ కప్ తర్వాత తన కుమారుడి మ్యాచ్ చూడటానికి వెళ్లాడు. అతని ఫొటో వైరల్‌గా మారింది. కోచ్‌గా ఉన్నప్పుడు, ద్రవిడ్ తన కొడుకులపై పెద్దగా శ్రద్ధ చూపలేకపోవచ్చు. కానీ, అతను అవకాశం దొరికినప్పుడల్లా తన కొడుకుల ఆటల గురించి సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ద్రవిడ్ మరో కుమారుడు సమిత్ కూడా దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌ల కుమారులు కూడా.. వారిలానే ఎదగగలరా అనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..