Piyush Chawla Father Died : టీమిండియా క్రికెటర్ పీయూష్ చావ్లా తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా కరోనాతో మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం కొవిడ్‌కి గురైన ఆయన చికిత్స తీసుకుంటూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. విషయం తెలుసుకున్న సహచర ఆటగాళ్లు, అభిమానులు పీయూష్ చావ్లాకు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ రోజు తన మూల స్తంభాన్ని కోల్పోయా అని పీయూష్ చావ్లా ట్వీట్ చేశాడు. ‘ఈ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది. నా ప్రియమైన నాన్న మిస్టర్ ప్రమోద్ కుమార్ చావ్లా ఈ రోజు చనిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మీరు ఇచ్చిన మద్దతు మరువలేనిది. నాన్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని చావ్లా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు.
32 ఏళ్ల లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అయినప్పటికీ అతను 2012 నుండి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. 2014లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో భాగమైన పియూష్ చావ్లాను గత ఫిబ్రవరి వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా తండ్రి కూడా కరోనాకు బలైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారిన పడిన సకారియా తండ్రి కంజి భాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఇంటికి చేరిన సకారియా తన తండ్రిని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు.