Pakistan: టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీగా జరిమానా విధించిన పీసీబీ

PCB fines Pakistan players: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ పరిచింది. సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో పీసీబీ ఫుల్ ఫైర్ అవుతోంది. ఈమేరకు పాక్ ఆటగాళ్లకు భారీగా జరిమానా కూడా విధించింది.

Pakistan: టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీగా జరిమానా విధించిన పీసీబీ
Pakistan Cricket

Updated on: Mar 02, 2026 | 11:45 AM

Pakistan: టీ20 వరల్డ్ కప్ 2026లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై కఠిన చర్యలు తీసుకున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) జట్టులోని ప్రతి ఆటగాడిపై లక్షల్లో జరిమానా విధించింది. టోర్నీ నుంచి బయటపడిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్థాన్ రూపాయల జరిమానా..

మీడియా నివేదికల ప్రకారం, పీసీబీ ప్రతి ఆటగాడిపై 50 లక్షల పాకిస్థాన్ రూపాయలు (సుమారు 16 లక్షల భారతీయ రూపాయలు) జరిమానా విధించింది. టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొన్న ప్రతి సభ్యుడికీ ఈ నిర్ణయం వర్తిస్తుంది.

ఈ మొత్తం ఆటగాళ్ల జీతం, మ్యాచ్ ఫీజు లేదా ఇతర చెల్లింపుల నుంచి నేరుగా కట్ చేయనున్నారు. పనితీరును ఆర్థికంగా కూడా అనుసంధానించే కొత్త విధానంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి చర్యలు కొత్తవి కావు. అయితే ఈసారి జరిమానా మొత్తం ఎక్కువగా ఉండటం వల్ల ఇది పెద్ద చర్చకు దారితీసింది.

వరుసగా నాలుగో ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్‌కు దూరం..

పాకిస్థాన్ జట్టు సూపర్-8 దశలోనే బయటపడింది. వరుసగా నాలుగో ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకోలేకపోవడం జట్టుపై ఒత్తిడిని పెంచింది.

టోర్నీ ప్రారంభంలో నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల తేడాతో, యూఎస్ఏపై 32 పరుగుల తేడాతో గెలిచినా, భారత్ చేతిలో 61 పరుగుల ఓటమి చవిచూసింది. ఆపై సూపర్-8లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల ఓటమి ఎదురైంది. శ్రీలంకపై గెలిచినా, నెట్ రన్ రేట్ కారణంగా తదుపరి దశకు అర్హత సాధించలేకపోయింది.

కఠిన నిర్ణయంతో సందేశం..

పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం జట్టుకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిరాశాజనక ఫలితాలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ వైఫల్యం ఆటగాళ్లకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us