
PCB chief Mohsin Naqvi mistakenly writes Pakistan PM Name: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటారనే సంగతి తెలిసిందే. ప్రపంచ కప్, ఆసియా కప్ వంటి టోర్నమెంట్లలో రెచ్చగొట్టే ప్రకటనల నుంచి బెదిరింపుల వరకు ఇలా ఎన్నో విషయాల్లో సంచలనంగా మారుతుంటాడు. ఇప్పుడు 2026 టీ20 ప్రపంచ కప్‌నకు ముందు మరోసారి ఇలాంటి కారణాల వల్ల వార్తల్లో నిలిచాడు. టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామంటూ ప్రకటిస్తున్నాడు. ఇలాంటి నాటకాన్ని రేకెత్తిస్తున్న సమయంలో, పాకిస్తాన్ ప్రధానమంత్రి పేరును తప్పుగా రాసి బుక్కయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అబాసుపాలయ్యాడు.
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడం గురించి పీసీబీ చైర్మన్ నఖ్వీ ఇటీవల కొత్త డ్రామా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో జనవరి 26, సోమవారం ఆయన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌ను కలిశాడు. ప్రధానితో జరిగిన సమావేశంలో, ప్రపంచ కప్‌నకు సంబంధించిన సమస్యలు, ఎంపికల గురించి నఖ్వీ ఆయనకు వివరించాడు. ఆ తర్వాత పీసీబీ చైర్మన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షరీఫ్‌తో తన సమావేశం గురించి పోస్ట్ చేశాడు. ఇదే విషయంలో ఆయన నవ్వుల పాలయ్యాడు.
Nawaz Sharif 🤣😝 https://t.co/UsOCmPLKkw
— Aakash Chopra (@cricketaakash) January 26, 2026
నిజానికి, ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌తో తన సమావేశాన్ని వివరిస్తూ, నఖ్వీ ఆయన పేరును తప్పుగా స్పెల్లింగ్ చేశాడు. షాబాజ్ షరీఫ్‌కు బదులుగా, నఖ్వీ ప్రధాన మంత్రి మియాన్ ముహమ్మద్ నవాజ్ షరీఫ్ అని రాశాడు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, షాబాజ్ షరీఫ్ సోదరుడు. దీని ఫలితంగా నఖ్వీ పాకిస్తాన్ ప్రధాన మంత్రి పేరును తప్పుగా ఉచ్చరించడం హాస్యాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో అపహాస్యం పాలయ్యాడు. అతను త్వరగా తన తప్పును గ్రహించి, షాబాజ్ షరీఫ్ పేరును ఎడిట్ చేశాడు.
ఈ సమావేశం గురించి, షాబాజ్ షరీఫ్‌తో సమావేశం తర్వాత, ప్రపంచ కప్‌నకు సంబంధించి నిర్ణయం జనవరి 30వ తేదీ శుక్రవారం లేదా ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం తీసుకుంటామని నఖ్వీ అన్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నఖ్వీ ఇటీవల ప్రకటించాడు. ఈ విషయం గురించి ఆయన షరీఫ్‌తో సమావేశమయ్యాడు. కానీ, పాకిస్తాన్ ప్రస్తుతం ఉద్దేశపూర్వకంగా ఈ సమస్యను పొడిగించడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది.