
Pakistan : టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా ఆసియా ఖండం మరోసారి క్రికెట్ పండుగకు సిద్ధమవుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ మెగా టోర్నీని బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ ఆడుతున్న డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచం ముందు వరల్డ్ కప్ ఆడబోమని, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బిల్డప్ ఇచ్చిన పాక్.. లోలోపల మాత్రం అసలు కథ వేరే నడిపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వార్తలు పాకిస్థాన్ అసలు నైజాన్ని బయటపెట్టాయి. టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఆడుతున్న వింత నాటకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. భారత్ తమ దేశానికి వచ్చి ఆడటం లేదన్న నెపంతో, తాము కూడా టీ20 వరల్డ్ కప్ ఆడబోమని, టోర్నీని బహిష్కరిస్తామని పాక్ ప్రచారం చేసింది. కానీ, తాజా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ లోలోపల తన ఆటగాళ్ల కోసం ఇప్పటికే శ్రీలంక ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసేసింది. ప్రపంచం ముందు ఒకలా మాట్లాడుతూ, వెనక మాత్రం టోర్నీలో పాల్గొనడానికి సిద్ధమవ్వడం పాక్ ద్వంద్వ నీతికి అద్దం పడుతోంది.
పాకిస్థాన్ జట్టు ఫిబ్రవరి 2వ తేదీన ఉదయాన్నే కొలంబోకు బయలుదేరనుంది. ఇప్పటికే ఆటగాళ్ల వీసాలు, హోటల్ బుకింగ్‌లు అన్నీ పీసీబీ పూర్తి చేసింది. అంటే, ఇన్నాళ్లూ పాక్ చేసిన బహిష్కరణ హెచ్చరికలన్నీ కేవలం ఐసీసీపై ఒత్తిడి తెచ్చేందుకే అని స్పష్టమైంది. వెన్యూ మార్పు విషయంలో బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తున్నట్లు నటించిన పాక్, చివరి నిమిషంలో తన స్వలాభం చూసుకుని బంగ్లాను కూడా ముంచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు పాక్ టీ20 కెప్టెన్ సల్మాన్ ఆగా స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 టాస్ సమయంలో ఆయన మాట్లాడుతూ.. “మేము శ్రీలంక వెళ్లేటప్పుడు అక్కడ కూడా ఇలాంటి పిచ్‌లే ఉంటాయి, అందుకే ఈ సిరీస్‌ను ప్రాక్టీస్‌గా వాడుకుంటున్నాము” అని నోరు జారారు. దీనితో పాక్ వరల్డ్ కప్ ఆడటం ఖాయమని అధికారికంగా అర్థమైంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో పాకిస్థాన్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. అంటే భారత్‌తో తలపడేందుకు కూడా పాక్ సిద్ధంగానే ఉందన్నమాట. ఇన్ని డ్రామాలు ఆడి చివరకు తోక ముడిచి టోర్నీకి వెళ్తుండటంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.