T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం (జనవరి 25) లాహోర్‌లో పాక్ జట్టును ప్రకటించిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టును ఎంపిక చేసినప్పటికీ టోర్నీలో పాల్గొంటామో లేదో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు.

T20 World Cup 2026 : టీమ్ రెడీ..క్రికెట్ కిట్లు రెడీ..కానీ బోర్డర్ దాటడానికి  పీఎం పర్మిషన్ కావాలట ? పాక్ క్రికెట్‌లో వింత డ్రామా
Pakistan T20 World Cup 2026

Updated on: Jan 26, 2026 | 10:15 AM

T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆదివారం (జనవరి 25) లాహోర్‌లో పాక్ జట్టును ప్రకటించిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, జట్టును ఎంపిక చేసినప్పటికీ టోర్నీలో పాల్గొంటామో లేదో ఇప్పుడే చెప్పలేమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.

టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించినప్పటికీ, టోర్నీలో పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడలేమని బాంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తప్పుకోవడంతో, ఐసీసీ ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ విషయంలో బాంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఐసీసీ తీరును తప్పుబట్టారు. “ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు అందాలి. ప్రభుత్వం వెళ్లొద్దు అంటే మేము వెళ్లము. ఐసీసీ తన ద్వంద్వ నీతిని వీడాలి” అని నఖ్వీ ఆటగాళ్లతో జరిగిన సమావేశంలో ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇక జట్టు విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీకి సల్మాన్ అలీ ఆఘాను కెప్టెన్‌గా నియమించారు. మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్ జట్టులోకి తిరిగి రాగా, స్టార్ పేసర్ హరీస్ రవూఫ్‌పై వేటు పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీలంకలోని స్పిన్ పరిస్థితులకు అనుగుణంగా జట్టును ఎంపిక చేశామని, అందుకే రవూఫ్ స్థానంలో అదనపు స్పిన్నర్లను తీసుకున్నామని సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వివరించారు. మరోవైపు స్టార్ పేసర్లు షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

పాకిస్థాన్ తన గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోని కొలంబోలో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాక్ తలపడాల్సి ఉంది. అయితే బాంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ మొండిగా వ్యవహరించిందని, ఒకే దేశం (భారత్) ఆధిపత్యం నడుస్తోందని నఖ్వీ ఆరోపించారు. ప్రస్తుతానికి జట్టును ప్రకటించినా, ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే పాక్ జట్టు భవిష్యత్తుపై స్పష్టత రానుంది. ఒకవేళ పాక్ తప్పుకుంటే ప్రపంచకప్ క్రేజ్ భారీగా తగ్గే అవకాశం ఉంది.

పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ జట్టు: సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబార్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహమ్మద్ నఫీ (కీపర్), మహమ్మద్ నవాజ్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), ఉస్మాన్ తారిక్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..