
ఆసియా కప్ సందర్భంగా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లలో ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. ఆట గౌరవాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ చర్యల్లో భాగంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ హారిస్ రవూఫ్‌పై రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం పడింది. భారత్ తరపున సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు కూడా జరిమానాలు, డీమెరిట్ పాయింట్లను ఎదుర్కొన్నారు.
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్‌కు ICC అత్యంత కఠినమైన శిక్షను విధించింది. రెండు వేర్వేరు సంఘటనల్లో ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించినందుకు గాను.. అతనికి ప్రతి సంఘటనకు రెండు చొప్పున మొత్తం నాలుగు డీమెరిట్ పాయింట్లను పొందాడు. 24 నెలల కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్లు రావడంతో రవూఫ్‌పై రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం విధించారు. దీంతో అతను నవంబర్ 4, 6 తేదీల్లో దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే మ్యాచ్‌లలో ఆడటానికి అనర్హుడయ్యాడు. ఈ రెండు సంఘటనలకు గాను అతనికి మ్యాచ్ ఫీజులో జరిమానా కూడా విధించారు.
సెప్టెంబర్ 14న జరిగిన మొదటి మ్యాచ్‌లో, భారత్, పాక్ ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ చర్యలు తీసుకున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఈ విజయాన్ని పహల్గామ్ బాధితుల కుటుంబాలకు, భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఇది ఆట నియమాలకు విరుద్ధం. దీంతో ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం సూర్య దోషిగా తేలారు. ఫలితంగా అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా, రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు. ఆ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన 6 ఫైటర్ జెట్‌లను కూల్చివేసినట్లుగా రవూఫ్ చేతితో సంజ్ఞ చేశాడు. ఆర్టికల్ 2.21 ఉల్లంఘనకు గాను రవూఫ్ మ్యాచ్ ఫీజు30 శాతం జరిమానా, రెండు డీమెరిట్ పాయింట్లు విధించారు.
ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్.. ఫైనల్‌లో ఉల్లంఘనలకు పాల్పడిన ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నారు. బుమ్రా ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ తీసిన తర్వాత అతిగా సంబరాలు చేసుకున్నందుకు వార్నింగ్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది. అదే ఆర్టికల్ ఉల్లంఘనకు గాను పాక్ ప్లేయర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు వార్నింగ్‌తో పాటు ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది.