
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం ముగిసింది. ఆశించిన స్థాయిలో రాణించలేక సూపర్ 8 రౌండ్‌లోనే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. అయితే ఆట పరంగా అభిమానులను నిరాశపరిచినప్పటికీ, ఐసీసీ నుంచి భారీగానే నగదు బహుమతిని అందుకోబోతోంది పాక్ జట్టు. టోర్నీ నుంచి నిష్క్రమించినా, నిబంధనల ప్రకారం ఆ జట్టుకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. సూపర్ 8 వరకు చేరడం, అలాగే ఆడిన మ్యాచుల్లో సాధించిన విజయాల ఆధారంగా ఈ లెక్కలు వేస్తున్నారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. సూపర్ 8 దశలో వెనుదిరిగిన జట్లకు (5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు) సుమారు 3.8 లక్షల అమెరికన్ డాలర్ల గ్యారెంటీ ప్రైజ్ మనీ లభిస్తుంది. మన భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.3.5 కోట్లు. టోర్నీలో పాల్గొన్నందుకు, సూపర్-8 రౌండ్ వరకు ప్రయాణించినందుకు గానూ ఈ మొత్తాన్ని ఐసీసీ అందజేస్తుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా, జట్టు సాధించిన ప్రతి విజయాకి అదనంగా బోనస్ కూడా లభిస్తుంది.
ఈ వరల్డ్ కప్‌లో సెమీఫైనల్, ఫైనల్ మినహా, గ్రూప్ స్టేజ్, సూపర్ 8లో సాధించిన ప్రతి విజయాకి ఐసీసీ సుమారు 31,154 డాలర్లు (దాదాపు రూ. 28 లక్షలు) ఇస్తుంది. పాకిస్థాన్ ఈ టోర్నీలో మొత్తం 4 మ్యాచుల్లో విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో నెదర్లాండ్స్, యూఎస్ఏ, నమీబియాపై గెలవగా.. సూపర్ 8లో శ్రీలంకపై ఒక విజయాన్ని నమోదు చేసింది. ఈ 4 విజయాలకు గానూ అదనంగా 1.24 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.1.12 కోట్లు పాక్ ఖాతాలో చేరనున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ వరల్డ్ కప్ ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.4.6 కోట్ల పైచిలుకు ఆదాయం లభించనుంది.
పాకిస్థాన్ ఈ టోర్నీని విజయంతోనే మొదలుపెట్టింది. నెదర్లాండ్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి మంచి ఊపు మీద కనిపించింది. ఆ తర్వాత అమెరికాపై కూడా 32 పరుగుల తేడాతో గెలిచింది. కానీ, చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతింది. సూపర్-8లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం, ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిపోవడం పాక్ కొంపముంచింది. ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచినా.. రన్ రేట్ లెక్కల్లో వెనుకబడి సెమీస్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆట కంటే ఆదాయమే ఎక్కువగా లభించిన ఈ టోర్నీ పాక్ క్రికెట్ చరిత్రలో ఒక వింత అనుభవంగా మిగిలిపోనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..