On This Day: భారత్‌లో పాక్ పర్యటన.. 405 నిమిషాల పాటు సచిన్ బ్యాటింగ్.. సీన్ కట్ చేస్తే.. చివరికి!

|

Jan 31, 2023 | 8:31 AM

Sachin Tendulkar: ఈ టెస్ట్ మ్యాచ్ ఇప్పటిది కాదు 24 ఏళ్లనాటిది. 1999లో జరిగిన చెన్నై టెస్టులో అసలేం జరిగింది.? సరిగ్గా 4 రోజుల్లో పూర్తయిన..

On This Day: భారత్‌లో పాక్ పర్యటన.. 405 నిమిషాల పాటు సచిన్ బ్యాటింగ్.. సీన్ కట్ చేస్తే.. చివరికి!
Sachin Tendulkar
Follow us on

సచిన్ టెండూల్కర్ కష్టానికి ప్రతిఫలం లేకపోయింది. అతడు సుమారు 7 గంటల పాటు బ్యాటింగ్ చేసినా.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. సీన్ కట్ చేస్తే.. టీమిండియాపై పాకిస్తాన్ అద్భుత విజయాన్ని సాధించింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ఇప్పటిది కాదు 24 ఏళ్లనాటిది. 1999లో జరిగిన చెన్నై టెస్టులో అసలేం జరిగింది.? సరిగ్గా 4 రోజుల్లో పూర్తయిన ఆ మ్యాచ్‌లో సచిన్ వీరోచిత పోరాటం చేసినా.. టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయింది.

చెన్నైలోని చిదంబరం స్టేడియం ఎన్నో మరపురాని టెస్టు మ్యాచ్‌లకు సాక్షిగా నిలిచింది. ఇక్కడ 1986లో భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ టైగా ముగిస్తే.. 2008లో భారత్-ఇంగ్లాండ్ టెస్టులో సచిన్ టెండూల్కర్ – యువరాజ్ సింగ్ చివరి రోజున 387 పరుగులు చేధించి.. టీమిండియాకు విజయాన్ని అందించారు. అయితే ఈసారి మాత్రం దాదాపు 7 గంటల పాటు సచిన్ టెండూల్కర్ పోరాటం చేసినా.. చివరికి భారత్ ఫ్యాన్స్ నిరాశగా వెనుదిరిగారు.

9 ఏళ్ల తర్వాత భారత్‌లో పాక్‌ పర్యటన..

9 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. ఆ సిరీస్‌లోని తొలి మ్యాచ్ చెన్నైలో జరిగింది. జనవరి 28న ప్రారంభమైన ఈ మ్యాచ్.. జనవరి 31న ముగిసింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరపున అనిల్ కుంబ్లే 6 వికెట్లు పడగొట్టాడు. ఇక దీనికి సమాధానంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేయగలిగింది. భారత్ తరఫున సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ అర్ధ సెంచరీలతో రాణించారు. సచిన్ టెండూల్కర్ తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవలేకపోయాడు. పాక్ బౌలర్లలో సక్లిన్ ముస్తాక్ 5 వికెట్లు తీశాడు. అటు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేయగా.. టీమిండియాకు టార్గెట్ 271 పరుగులను నిర్దేశించింది. షాహిద్ అఫ్రిది 141 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈసారి వెంకటేష్ ప్రసాద్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా 6 వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి

వెన్నునొప్పితో సచిన్ 7 గంటల బ్యాటింగ్..

రెండో ఇన్నింగ్స్‌కి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ముందు 271 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది. ఈ లక్ష్యచేధనలో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సచిన్ టెండూల్కర్, నయన్ మోంగియా తప్ప మిగిలిన బ్యాటర్లు యీవరూ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. అయితేనేం సచిన్ మాత్రం చివరి వరకు పోరాడాడు. వెన్నునొప్పి బాధపెడుతున్నా.. తన జట్టును విజయానికి చేరువ చేసేందుకు ప్రయత్నించాడు. మోంగియా కూడా అతడికి చక్కటి మద్దతు ఇచ్చాడు.

సచిన్ మొత్తం 405 నిమిషాలు బ్యాటింగ్ చేసి 273 బంతులు ఎదుర్కొని 136 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో మోంగియా 52 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వీరిద్దరి ప్రయత్నం భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో సఫలం కాలేదు. పాక్ బౌలర్ సక్లిన్ ముస్తాక్ మరోసారి 5 వికెట్లు తీసి.. టీమిండియా ఓటమికి కీలక పాత్ర పోషించాడు. దీంతో పాకిస్థాన్ 12 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 136 పరుగులు చేసిన సచిన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..