Bob Simpson : చరిత్రలో ఒకేఒక్కడు.. మాంచెస్టర్ మైదానంలో ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ ఎవరంటే ?

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ బాబ్ సింప్సన్ గురించి తెలుసుకోండి. 1964లో ఇంగ్లాండ్‌పై అతను సాధించిన 311 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆధునిక క్రికెట్‌లో కూడా ఇలాంటి ఇన్నింగ్స్‌లు చాలా అరుదుగా కనిపిస్తాయి. మాంచెస్టర్ టెస్టులో భారత్-ఇంగ్లాండ్ ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శనలు వస్తాయో చూడాలి.

Bob Simpson : చరిత్రలో ఒకేఒక్కడు.. మాంచెస్టర్ మైదానంలో ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ ఎవరంటే ?
Bob Simpsons Triple Century

Updated on: Jul 22, 2025 | 12:24 PM

Bob Simpson : భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగనుంది. ఈ మైదానానికి ఒక ప్రత్యేక రికార్డు ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇక్కడ ట్రిపుల్ సెంచరీ (300 పరుగులు) సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ బాబ్ సింప్సన్ మాత్రమే. ఆ అద్భుతమైన మ్యాచ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఈ మ్యాచ్ 1964 జూలై 23-28 తేదీల్లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ బాబ్ సింప్సన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

బాబ్ సింప్సన్, బిల్ లారీతో కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ మొదటి వికెట్‌కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. బిల్ లారీ 313 బంతుల్లో 106 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, సింప్సన్ మాత్రం రెండో ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయాడు. బాబ్ సింప్సన్, బ్రియాన్ బూత్ తో కలిసి ఐదవ వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, జట్టు స్కోరును 600 పరుగుల మార్కును దాటించాడు. సింప్సన్ 743 బంతులు ఎదుర్కొని 311 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 762 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్, 23 ఫోర్లు ఉన్నాయి. సింప్సన్ అద్భుతమైన బ్యాటింగ్ పుణ్యమా అని ఆస్ట్రేలియా 656/8 స్కోరు వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో జాన్ ప్రైస్ మూడు వికెట్లు తీశాడు, ఫ్రెడ్ రమ్సే, టామ్ కార్ట్‌రైట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా భారీ స్కోరుకు సమాధానంగా, ఇంగ్లాండ్ 15 పరుగులకే జాన్ ఎడ్రిచ్(6) వికెట్ కోల్పోయింది. అయితే, అక్కడ నుండి కెప్టెన్ టెడ్ డెక్స్‌టర్, ఓపెనర్ జియోఫ్ బాయ్‌కాట్ తో కలిసి రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నాడు. జియోఫ్ బాయ్‌కాట్ 58 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ టెడ్ డెక్స్‌టర్ కెన్ బారింగ్టన్ తో కలిసి మూడో వికెట్‌కు 246 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. డెక్స్‌టర్ 174 పరుగులకు అవుటవ్వగా, బారింగ్టన్ 256 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 611 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తరఫున గ్రాహం మెకెంజీ ఏడు వికెట్లు తీసుకోగా, టామ్ వీవర్స్ మిగిలిన మూడు వికెట్లు పడగొట్టాడు.

ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు ఆడి, వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. చివరకు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో బాబ్ సింప్సన్ ట్రిపుల్ సెంచరీకి, ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానానికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..