​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన స్మృతి మంధాన.. ఆ అరుదైన జాబితాలో ఏకైక భారతీయురాలిగా రికార్డ్..!

Time Most Influential People in Sports: భారతదేశంలో మహిళా క్రికెట్‌కు సరికొత్త గుర్తింపును, క్రేజ్‌ను తీసుకువచ్చిన స్మృతి మంధాన, ఇప్పుడు గ్లోబల్ ఐకాన్‌గా అవతరించింది. మెస్సి, రొనాల్డో వంటి మహామహుల సరసన నిలిచి, దేశంలోని కోట్లాది మంది యువతులకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది. మైదానంలో ఆమె సృష్టిస్తున్న ఈ పరుగుల ప్రభంజనం, సాధిస్తున్న విజయాలు రాబోయే తరాలకు పెద్ద స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన స్మృతి మంధాన.. ఆ అరుదైన జాబితాలో ఏకైక భారతీయురాలిగా రికార్డ్..!
Smriti Mandhana In Time Magazine Most Influential People In Sports
Image Credit source: https://x.com/lonsaikia

Updated on: Jun 16, 2026 | 3:15 PM

Smriti Mandhana: మహిళా క్రికెట్ సంచలనం, టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అంతర్జాతీయ స్థాయిలో అత్యంత అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ‘టైమ్’ మేగజైన్ ప్రకటించిన 2026 ప్రపంచ అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో ఆమెకు చోటు లభించింది. విశేషమేమిటంటే, ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ అథ్లెట్‌గా స్మృతి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ప్రపంచ దిగ్గజాల సరసన లేడీ కోహ్లీ..

​క్రీడా ప్రపంచంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఫుట్‌బాల్ లెజెండ్స్ లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో, బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ వంటి గ్లోబల్ ఐకాన్స్ పక్కన మన దేశం తరపున ఒకే ఒక్క పేరు నిలిచింది.. ఆ పేరే స్మృతి మంధాన. సాధారణంగా భారత క్రికెట్ అనగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లు ముందుగా వినిపిస్తాయి. కానీ, ఈసారి వారిని సైతం పక్కకు నెట్టి, ప్రపంచాన్ని శాసిస్తున్న క్రీడా శక్తుల జాబితాలో స్మృతి స్థానం సంపాదించడం దేశానికే గర్వకారణంగా మారింది. కేవలం మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు, అంతర్జాతీయ క్రీడా గమనాన్ని ప్రభావితం చేయగల శక్తిగా ఆమె ఎదిగిందని ‘టైమ్’ మేగజైన్ కొనియాడింది.

రికార్డుల రాణి..

​ముంబైలో జన్మించిన ఈ 29 ఏళ్ల ఎడమచేతి వాటం ఓపెనర్ ప్రదర్శనను టైమ్ మేగజైన్ ప్రత్యేకంగా ప్రశంసించింది. డొమెస్టిక్ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారతీయ మహిళగా, క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన ఏకైక భారతీయ బ్యాటర్‌గా స్మృతి సరికొత్త మైలురాళ్లను అందుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 17 సెంచరీలు సాధించిన రికార్డును ఆమె పంచుకుంటోంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టించింది. 2024, 2025 లలో వరుసగా మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచి, ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్’ పురస్కారాన్ని సైతం కైవసం చేసుకుంది.

కెప్టెన్‌గా తిరుగులేని విజయాలు..

​స్మృతి కేవలం వ్యక్తిగత రికార్డులకే పరిమితం కాలేదు. జట్టును ముందుండి నడిపించే అద్భుతమైన నాయకత్వ పటిమ ఆమె సొంతం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు నాయకత్వం వహించి, 2024, ఈ ఏడాది 2026 లోనూ జట్టుకు టైటిల్స్ అందించి ట్రోఫీల రాణిగా నిలిచింది. అంతేకాకుండా, గతేడాది భారత్ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ గెలవడంలో వైస్ కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఆ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచింది.

​ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ స్మృతి అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 44 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టు భారీ విజయానికి పునాది వేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us