Yograj Singh : నా జీవితంలో చాలా తప్పులు చేశాను.. కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణ కోరిన యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్
క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి, యోగ్‌రాజ్ సింగ్ ఇటీవల కన్నీళ్లతో క్షమాపణలు చెప్పారు. ప్రాణాపాయం ఎదురైన తర్వాత మనసు మార్చుకున్న యోగ్‌రాజ్, యువరాజ్ సింగ్‌ను, తన మొదటి భార్యను క్షమించమని వేడుకున్నారు. తాను తన జీవితంలో ఎన్నో తప్పులు చేశానని అంగీకరించాడు.

Yograj Singh : జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపం లేదని, తన తల్లి చనిపోయినప్పుడు మాత్రమే ఏడ్చానని గతంలో అనేక ఇంటర్వ్యూలలో చెప్పిన నటుడు, మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ ఇటీవల మనసు మార్చుకున్నారు. తాను ఎవరిని బాధపెట్టినా, వారికి కన్నీళ్లతో క్షమాపణ చెబుతున్నా అన్నారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న యోగ్‌రాజ్, తాను తన జీవితంలో ఎన్నో తప్పులు చేశానని అంగీకరించడమే కాకుండా, తన కొడుకు యువరాజ్ సింగ్, తన మొదటి భార్యను క్షమించమని వేడుకున్నారు. యువరాజ్‌కు 17 ఏళ్ల వయసులో ఇంకా భారత జట్టులోకి రాకముందే వారు యోగ్‌రాజ్‌ను విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాపాయం ఎదురైందని, దాని నుంచి బయటపడటం ఒక అద్భుతమని యోగ్‌రాజ్ సింగ్ తెలిపారు. కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లానని, అక్కడ పరీక్షల తర్వాత తనకు ఆపరేషన్ చేయాలని, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ అనుభవం తన జీవితంలో అంతర్గతంగా పెద్ద మార్పు తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. గతంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు, యువరాజ్‌ను పెంచినట్టే మళ్లీ పెంచే అవకాశం వస్తే, అదే కష్టాల గుండా తీసుకెళ్తాను అని చెప్పిన యోగ్‌రాజ్, ఇప్పుడు తాను గతంలో తప్పుగా ప్రవర్తించానని అంగీకరించారు. ఇప్పుడు తనకు ఈ జీవితం నుంచి మోక్షం లభిస్తే చాలని కోరుకుంటున్నానని చెప్పారు.
తనకు పశ్చాత్తాపాలు ఉన్నాయా అని అడగగా, “చాలా ఉన్నాయి. నేను చేసింది నా ఆత్మగౌరవం, నా కుటుంబం కోసం మాత్రమే. గురువు చెప్పిన మాట ప్రకారం ఆ జ్ఞాపకాలను చాలా వరకు చెరిపేశాను. కానీ, చేతులు జోడించి క్షమించమని వేడుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులైనా, బయటివారైనా… నేను బాధపెట్టిన వారందరినీ నన్ను క్షమించమని కోరుతున్నాను. నా పిల్లలను, నా భార్యను, యువీ తల్లిని, ఇతరులందరినీ క్షమాపణ కోరుతున్నాను. అదంతా నా తప్పే. స్నేహితులు, క్రికెట్‌లో లేదా సినిమాల్లోని పోటీదారుల గురించి నేను ఎప్పుడైనా చెడుగా మాట్లాడి ఉంటే, నన్ను క్షమించండి. నాలో గుణాలు లేవు. లోపాలు మాత్రమే ఉన్నాయి. నా జీవితంలో నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు” అని కన్నీళ్లతో చెప్పారు.
గతంలో హైబ్రో స్టూడియోస్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్, తాను తన కుటుంబం మొత్తానికి దూరంగా ఉన్నానని, వారిని తాను మిస్ అవ్వడం లేదని చెప్పారు. తనకు కొడుకులు, కూతుళ్లు లేరని, కేవలం దేవుడి వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నానని కూడా అన్నారు. మరో ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్ తన కుటుంబం, పిల్లలు తనతో సఖ్యతగా లేకపోవడానికి ఒక కారణం చెప్పాడు. యువరాజ్‌ను కష్టపెట్టినట్లే తన మనవడు ఒరియన్‌ను కూడా అదే విధంగా కష్టపెడతానని భయపడుతున్నారని చెప్పారు. దీనిపై యువరాజ్ కూడా స్పందిస్తూ తన తండ్రి ఒరియన్‌ను క్రికెట్ ఆడమని బలవంతం చేస్తారేమోనని భయపడుతున్నానని, తన తండ్రి చేసిన తప్పులను తాను పునరావృతం చేయదలుచుకోలేదని చెప్పారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




