WCL 2025 : భారత్-పాక్ మ్యాచ్ రద్దుపై కొత్త ట్విస్ట్.. సెమీఫైనల్ ఉండదు సరే.. మరి ఫైనల్ పరిస్థితి ఏంటి ?

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో భారత్-పాకిస్థాన్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఉండదని కామిల్ ఖాన్ స్పష్టం చేశాడు. రద్దైన లీగ్ మ్యాచ్ కారణంగా భారత్ కాకుండా పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు లభించాయి. షాహిద్ అఫ్రిది క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని పిలుపునిచ్చాడు.

WCL 2025 : భారత్-పాక్ మ్యాచ్ రద్దుపై కొత్త ట్విస్ట్.. సెమీఫైనల్ ఉండదు సరే.. మరి ఫైనల్ పరిస్థితి ఏంటి ?
Wcl 2025

Updated on: Jul 21, 2025 | 1:16 PM

WCL 2025 : అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. జూలై 20న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగాల్సిన హై-వోల్టేజ్ లీగ్ మ్యాచ్, విమర్శలు, ఆటగాళ్ల ఉపసంహరణల కారణంగా రద్దయింది. ఇప్పుడు పాకిస్థాన్ ఛాంపియన్స్ టీమ్ యజమాని కామిల్ ఖాన్ ఒక కీలక విషయాన్ని స్పష్టం చేశాడు. ఒకవేళ ఇరు జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరినా, అక్కడ అవి ఒకదానితో ఒకటి తలపడవని ఆయన కన్ఫాం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “రద్దైన మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. టోర్నమెంట్ అనుకున్న విధంగానే కొనసాగుతోంది. సెమీ-ఫైనల్స్ విషయానికొస్తే ఒకవేళ ఇరు జట్లు ఆ దశకు చేరితే అవి ఒకదానితో ఒకటి తలపడకుండా చూస్తాం” అని వివరించాడు.

సెమీ-ఫైనల్ గురించి ఓ క్లారిటీ వచ్చినప్పటికీ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తలపడే అవకాశంపై మాత్రం కామిల్ ఖాన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. “ఒకవేళ రెండు జట్లు ఫైనల్‌కు చేరితే, ఆ సమయంలో దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు” అని ఆయన తెలిపారు.

శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ వంటి కీలక భారత ఆటగాళ్లు తప్పుకోవడంతో, జూలై 20న జరగాల్సిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్ రద్దయింది. టోర్నమెంట్ నియమాల ప్రకారం.. భారత్ ఆడటానికి నిరాకరించినందుకు పాకిస్థాన్‌కు రెండు పాయింట్లు లభించాయి. ‘‘మేము ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. రూల్స్ ప్రకారం పాయింట్లు మాకే రావాలి, అలాగే వచ్చాయి’’ అని కామిల్ ఖాన్ పేర్కొన్నాడు.

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, క్రీడల ద్వారా కలిసి రావాలని పిలుపునిచ్చాడు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, “క్రీడలు ప్రజలను దగ్గర చేస్తాయి, కానీ ప్రతిదానిలో రాజకీయాలు కలిస్తే ఎలా ముందుకు సాగగలం? మనం కూర్చుని చర్చించుకోనంత కాలం, ఏమీ బాగుకాదు. కమ్యూనికేషన్ లోపం విషయాలను మరింత దిగజార్చుతుంది. మేము ఇక్కడ క్రికెట్ ఆడటానికి, ఒకరితో ఒకరు ముఖాముఖి సంభాషించడానికి, స్నేహపూర్వక సంభాషణలు జరపడానికి వచ్చాం” అని అఫ్రిది చెప్పాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి