
Nicholas Pooran Salary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అనేక సంచలనాలకు వేదికవుతోంది. మైదానంలో పరుగుల వరద పారుతున్నా, ఒకప్పుడు బౌలర్లను వణికించిన ఒక స్టార్ ఆటగాడు మాత్రం ఇప్పుడు దారుణంగా విఫలమవుతున్నాడు. భారీ ధర పలికిన ఈ ఆటగాడి పేలవ ప్రదర్శన చూస్తుంటే, వచ్చే ఏడాది వేలంలో అతడిని కొనేవారే ఉండరన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మనం మాట్లాడుకుంటున్నది వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ గురించి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా పరుగులు సాధించే ఆటగాళ్లలో పూరన్ ఒకడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతడిపై ఉంచిన నమ్మకం, వెచ్చించిన కోట్లు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఈ సీజన్‌లో అతడి బ్యాట్ పూర్తిగా మూగబోయింది. మైదానంలోకి రావడం, తక్కువ పరుగులకే వెనుదిరగడం అతడికి పరిపాటిగా మారింది. 2026 సీజన్ ఆరంభానికి ముందే లక్నో జట్టు అతడిని భారీ ధరకు అట్టిపెట్టుకుంది, కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో పూరన్ విఫలమయ్యాడు.
నికోలస్ పూరన్ ప్రతిభను గుర్తించి లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం అతడికి ఏకంగా 21 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని అందించింది. గత సీజన్లలో మెరుపులు మెరిపించిన పూరన్, ఈసారి మాత్రం లక్నో పాలిట శాపంగా మారాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన పూరన్, కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో దారుణమైన విషయం ఏమిటంటే, అతడి సగటు కేవలం 10.25 మాత్రమే ఉండగా, స్ట్రైక్ రేట్ 81.19 కి పడిపోయింది. భారీ హిట్టర్‌గా పేరున్న ఆటగాడు కనీసం బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
2025 సీజన్‌లో పూరన్ ఆడిన తీరు అద్భుతం. అప్పట్లో 14 మ్యాచ్‌ల్లో 43.67 సగటుతో 524 పరుగులు చేశాడు. దాదాపు 196 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ సీజన్‌లో 5 అర్ధ సెంచరీలు చేయడమే కాకుండా, 45 ఫోర్లు, 40 సిక్సర్లు బాదాడు. ఆ ప్రదర్శన చూసే యజమాని సంజీవ్ గోయెంకా అతడి జీతాన్ని 16 కోట్ల నుంచి 21 కోట్లకు పెంచారు. కానీ ఇప్పుడు పెరిగిన జీతానికి తగ్గట్టుగా ప్రదర్శన పాతాళానికి పడిపోయింది.
ప్రస్తుతం 31 ఏళ్ల వయసులో ఉన్న పూరన్, తన కెరీర్‌లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. లక్నో జట్టు అతడిని వచ్చే సీజన్ కంటే ముందే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పూరన్ వేలంలోకి వస్తే, ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ ఫ్రాంచైజీ కూడా అంత భారీ మొత్తాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఒకవేళ పూరన్ అమ్ముడుపోకుండా మిగిలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..