
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఆడినా, ఆడకపోయినా ఏదో ఒక వార్తతో నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై సిద్ధూ చేసిన కామెంట్స్ చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న ఒక వీడియోను షేర్ చేస్తూ మనసులో మాటను బయటపెట్టారు. “దేవుడు నాకు ఒక వరం కోరుకునే అవకాశం ఇస్తే.. విరాట్ కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని, మళ్ళీ వైట్ జెర్సీలో రెడ్ బాల్‌తో ఆడాలని కోరుకుంటాను. అతను మళ్ళీ టెస్టులు ఆడితే 150 కోట్ల మంది భారతీయులకు అంతకంటే పెద్ద సంతోషం మరొకటి ఉండదు” అని రాసుకొచ్చారు. కోహ్లీ ఫిట్‌నెస్‌ను చూస్తుంటే 20 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడని, అతను 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అని సిద్ధూ కొనియాడారు.
37 ఏళ్ల విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. తనకు ఎంతో ఇష్టమైన ఫార్మాట్ నుంచి తప్పుకోవడం అప్పట్లో అందరినీ షాక్‌కు గురిచేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డారు. పెర్త్ టెస్టులో సెంచరీ చేసినప్పటికీ, ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో ఆఫ్ స్టంప్ బయట వచ్చే బంతులను ఆడే క్రమంలో వరుసగా అవుట్ అయ్యారు. ఆ ఒత్తిడి వల్లే కోహ్లీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
టెస్టుల నుంచి తప్పుకున్నాక, వైట్ బాల్ క్రికెట్ (వన్డేలు)లో కోహ్లీ మళ్ళీ పాత రోజులను గుర్తుచేస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌ల్లోనే 200లకు పైగా పరుగులు సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ బాది తానేంటో నిరూపించుకున్నాడు. అయితే తాను ఇప్పుడు కేవలం వన్డేలపైనే దృష్టి పెడుతున్నానని కోహ్లీ స్పష్టం చేయడంతో, టెస్టుల్లోకి అతని రీఎంట్రీ దాదాపు అసాధ్యమనే అనిపిస్తోంది. కానీ సిద్ధూ పోస్ట్ చూసిన అభిమానులు మాత్రం ప్లీజ్ విరాట్.. ఒక్కసారి ఆలోచించు అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..