
Asia Cup : ఆసియ ఫైనల్‌లో భారత్ విజయం సాధించినా, ట్రోఫీ ప్రెజెంటేషన్ చుట్టూ అలుముకున్న వివాదం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. బీసీసీఐ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఎట్టకేలకు ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, భారత్‌కు ట్రోఫీ ఎప్పుడు అందుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఆసియా కప్ ఫైనల్‌లో విజేతగా నిలిచిన భారత్ జట్టుకు ట్రోఫీని అందించాల్సి ఉండగా, పాక్ మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అయిన ఏసీసీ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత్ నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
నఖ్వీ చర్య ఏసీసీ ప్రవర్తనా నియమావళి, ప్రోటోకాల్‌లను ఉల్లంఘించడమే అని బీసీసీఐ తీవ్రంగా ఖండించింది. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలోని ఏసీసీ ప్రధాన కార్యాలయానికి ట్రోఫీని తీసుకురావాలని అధికారులు నఖ్వీని కోరినా, ఆయన నిరాకరించారు. తన చేతుల మీదుగా అధికారిక కార్యక్రమంలో ట్రోఫీని స్వీకరించవచ్చని నఖ్వీ ప్రతిపాదించినప్పటికీ, భారత్ దానిని తిరస్కరించింది. “బీసీసీఐకి క్షమాపణలు చెప్పలేదు, చెప్పను” అని నఖ్వీ గతంలో ప్రకటించాడు, భారతీయ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించాడు.
నఖ్వీ వ్యవహారం హద్దులు దాటిందని బీసీసీఐ పేర్కొంది. ఏసీసీ అధ్యక్ష పదవి నుంచి నఖ్వీని తొలగించడానికి బీసీసీఐ చర్యలు ప్రారంభించింది. నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో నఖ్వీకి భారీ ఎదురుదెబ్బ తగులుతుందని బీసీసీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ట్రోఫీని భారత్‌కు ఎప్పుడు అందజేస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.
మంగళవారం జరిగిన ఏసీసీ వర్చువల్ సమావేశంలో, బీసీసీఐ ప్రతినిధులు రాజీవ్ శుక్లా, ఆశిష్ షెలార్ నఖ్వీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోహ్సిన్ నఖ్వీ ఏసీసీ ఛైర్మన్‌గా ఉండటమే కాకుండా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి, పాకిస్తాన్ హోంమంత్రి కూడా. ఆయన భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్‌లు ఈ వివాదానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ కారణాల వల్లనే భారత జట్టు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. ప్రెజెంటేషన్ వేడుక 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, పాకిస్తాన్ జట్టు మాత్రం రన్నరప్ చెక్, మెడల్స్‌ను స్వీకరించింది. మైదానంలో మ్యాచ్ ముగిసినా, మైదానం వెలుపల క్రికెట్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. నఖ్వీ భవిష్యత్తు, ఆసియా కప్ ట్రోఫీ వితరణపై స్పష్టత రావాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..