MS Dhoni : 44 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే..ఐపీఎల్ 2026 కోసం ధోని మిలిటరీ ట్రైనింగ్ షెడ్యూల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‎లో ఎంఎస్ ధోని భవిష్యత్తు గురించి గత కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నా, ధోని మాత్రం తన దారిన తాను వెళ్తున్నారు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న ధోని.. తన సొంత నగరమైన రాంచీలో చాలా కఠినమైన శిక్షణను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

MS Dhoni : 44 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే..ఐపీఎల్ 2026 కోసం ధోని మిలిటరీ ట్రైనింగ్ షెడ్యూల్
చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశి విశ్వనాథన్ మహేంద్ర సింగ్ ధోని పదవీ విరమణ చేయడం లేదని, IPL 2026 లో ఆడతాడని ధృవీకరించారు. "ఐపీఎల్ 2026 లో ధోనిని మనం ఖచ్చితంగా చూస్తాం" అని కాశి ఈ విషయాన్ని ధృవీకరించారు.

Updated on: Nov 15, 2025 | 9:55 AM

MS Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్‎లో ఎంఎస్ ధోని భవిష్యత్తు గురించి గత కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నా, ధోని మాత్రం తన దారిన తాను వెళ్తున్నారు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న ధోని.. తన సొంత నగరమైన రాంచీలో చాలా కఠినమైన శిక్షణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. జిమ్, స్విమ్మింగ్, వరుసగా పవర్-హిట్టింగ్ మ్యారథాన్‌లతో ధోనీ తన ఫిట్‌నెస్‌ను ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. గత రెండు నెలలుగా ధోనీ తన సొంత నగరం రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వెళ్తున్నారు. ధోని కఠినమైన రోజువారీ శిక్షణా షెడ్యూల్ ప్రకారం.. ప్రతిరోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు స్టేడియానికి చేరుకుంటారు. వచ్చిన వెంటనే, ఒక గంట పాటు జిమ్‌లో తీవ్రమైన వర్కవుట్స్ చేస్తారు. ఫిట్‌నెస్ సెషన్ పూర్తయిన తర్వాత, ధోని ప్యాడ్స్ ధరించి, దాదాపు రెండు గంటల పాటు నెట్స్‌లో నిరంతరాయంగా పవర్-హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తారు.

సాధారణ నెట్ ప్రాక్టీస్‌తో పాటు, మెయిన్ వికెట్ అందుబాటులో ఉంటే, ధోని మ్యాచ్ సిమ్యులేషన్స్ కూడా చేస్తారు. అంటే, మ్యాచ్ పరిస్థితులను అనుకరిస్తూ సాధన చేయడం ద్వారా మ్యాచ్ ఫిట్‌నెస్‌ను పెంచుకుంటారు. ఈ శిక్షణ అంతా పూర్తయిన తర్వాత, ఆయన 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ సెషన్‌ను ముగించుకుంటారు. చివరగా, సాయంత్రం 6 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతారు. ఈ కఠినమైన రొటీన్‌ను బట్టి చూస్తే, రాబోయే ఐపీఎల్ సీజన్‌కు సిద్ధం కావడానికి ధోని ఎంతగా కష్టపడుతున్నారో అర్థమవుతుంది.

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 16 సీజన్లలో మొదటిసారిగా అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు పెరిగాయి. ఈ అనుమానాలను గత వారం సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ పూర్తిగా కొట్టిపారేశారు. “లేదు, ఆయన ఈ ఐపీఎల్ కంటే ముందు రిటైర్ కావడం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 గురించి ధోని గతంలో మాట్లాడుతూ.. “నిర్ణయం తీసుకోవడానికి నాకు నాలుగు, ఐదు నెలల సమయం ఉంది, తొందరపడాల్సిన అవసరం లేదు” అని చెప్పాడు.

సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి బ్లాక్‌బస్టర్ ట్రాన్స్‌ఫర్ డీల్‌లో సీఎస్కేలో చేరనున్నట్లు ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ శాంసన్ జట్టులో చేరితే, కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగించి, ధోనిపై పని భారాన్ని తగ్గించవచ్చు. 2008లో సీఎస్కేలో చేరినప్పటి నుంచి ఆ జట్టును ఐదు ఐపీఎల్ టైటిల్స్‌కు నడిపించిన ధోని, తర్వాతి సీజన్‌లో ఎంపిక చేసిన మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..