
MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నైలోని తమ హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోనీ స్టేడియం చుట్టూ తిరుగుతూ ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. ఈ క్రమంలో తన పాత స్నేహితుడు, సీఎస్‌కే మాజీ ఆటగాడు సురేష్ రైనాని గట్టిగా కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్నాడు. ఈ ఎమోషనల్ విజువల్స్ చూసి స్టేడియంలోని అభిమానులతో పాటు టీవీల ముందున్న కోట్లాది మంది ఫ్యాన్స్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే..
44 ఏళ్ల వయసున్న ధోనీ ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టోర్నమెంట్‌కు ముందే పిక్కండ్రాల నొప్పితో బాధపడిన ధోనీ, హైదరాబాద్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని అందరూ ఆశించారు. కానీ, ఫిట్‌నెస్ సహకరించకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ధోనీ రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, చెపాక్ మైదానంలో నిన్న అతను వీడ్కోలు పలికిన తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ధోనీ పసుపు జెర్సీలో కనిపించడం కష్టమేననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మ్యాచ్ ముగిశాక మైదానంలోకి వచ్చిన ధోనీ, స్టేడియం నలుమూలలా ఉన్న అభిమానులకు చేతులూపుతూ థాంక్స్ చెప్పాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తనకు హోమ్ గ్రౌండ్‌గా ఉన్న చెపాక్‌లో ఇదే తన చివరి ప్రదర్శన అనేలా ధోనీ ముఖంలో హావభావాలు కనిపించాయి. అదే సమయంలో అక్కడ కామెంటేటర్‌గా ఉన్న సురేష్ రైనా దగ్గరకు రాగానే, ధోనీ అతడిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో తలా-చిన్నతలాగా పేరు తెచ్చుకున్న వీరిద్దరిని అలా చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
రికార్డుల రారాజు..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకడు. తన కెరీర్‌లో మొత్తం 278 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా, అందులో 248 మ్యాచ్‌లు చెన్నై సూపర్ కింగ్స్ తరపునే ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 38.30 సగటుతో, 137.45 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 5,439 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నై జట్టుకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో పాటు రెండు సార్లు చాంపియన్స్ లీగ్ టి20 (CLT20) కప్పులను అందించి, ఫ్రాంచైజీ క్రికెట్‌లోనే అత్యంత సక్సెస్‌ఫుల్ లీడర్‌గా నిలిచాడు.
హైదరాబాద్ చేతిలో చెన్నై ఘోర పరాజయం..
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శామ్సన్ (27), డెవాల్డ్ బ్రెవిస్ (44) రాణించినా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15), శివమ్ దూబే నెమ్మదిగా ఆడటంతో భారీ స్కోరు చేయలేకపోయింది. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 3 వికెట్లతో చెన్నైని కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్ (70), హెన్రిచ్ క్లాసెన్ (47) ల మెరుపు ఇన్నింగ్స్‌తో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.