MS Dhoni : బర్త్ డే వేళ ధోనీకి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సెహ్వాగ్.. ఇలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదుగా !

MS Dhoni : 45వ పుట్టినరోజు సందర్భంగా మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ భావోద్వేగ పోస్టుతో శుభాకాంక్షలు తెలిపారు. కేరళలోని ‘ధోనీ’ జలపాతంతో ఆయన వ్యక్తిత్వాన్ని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

MS Dhoni : బర్త్ డే వేళ ధోనీకి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సెహ్వాగ్.. ఇలా చేస్తాడని ఎవ్వరూ  ఊహించలేదుగా !
Ms Dhoni

Updated on: Jul 07, 2026 | 8:14 PM

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజంగా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ జూలై 7న తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీని, 2026 ఐపీఎల్ సీజన్ మొత్తం మైదానంలో చూడాలని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. ఈ ప్రత్యేకమైన రోజున ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి, తోటి క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటికంటే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు వీరిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ, సెహ్వాగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ధోనీపై ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకున్నాడు.

సెహ్వాగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తామిద్దరూ కలిసి భారత్ తరఫున, అలాగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడిన పాత జ్ఞాపకాల ఫోటోలను పంచుకుంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని రాసుకొచ్చాడు. కేరళలోని పాలక్కాడ్ అడవుల మధ్య ఉండే ధోనీ వాటర్‌ఫాల్స్‎తో ఎమ్మెస్ ధోనీ వ్యక్తిత్వాన్ని పోల్చాడు. “కేరళలోని ఒక దట్టమైన అడవిలో ఒక జలపాతం ఉంది, దాని పేరు ‘ధోనీ’. అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. దారి చాలా కష్టంగా ఉంటుంది, కచ్చితంగా గైడ్ సహాయం కావాలి. మూడు గంటల పాటు నడిస్తేనే ఆ జలపాతం కనిపిస్తుంది. కానీ ఒక్కసారి అది కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అగ్నిపర్వతంలా ఉంటుంది. దాని ఉపరితలం ఎంతో మృదువుగా ఉన్నా, దగ్గరికి వెళ్తేనే దానికి ఎంత శక్తి ఉందో అర్థమవుతుంది” అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఈ జలపాతం గురించి కేరళ అటవీ శాఖ ఒక ప్రత్యేకమైన నిబంధనను కూడా రాసిపెట్టిందని సెహ్వాగ్ గుర్తుచేశాడు. “ఈ నీరు పైకి చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ లోపల అలా ఉండదు” అనేదే ఆ బోర్డు సారాంశం. “అయితే ఈ రూల్ అక్కడ ఉన్న జలపాతం కోసమా లేక జెర్సీ నంబర్ 7 కోసమా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మహేంద్ర సింగ్ ధోనీ పుట్టకముందు నుంచే కేరళలో ఆ ధోనీ అనే ప్రదేశం ఉంది. ప్రకృతికి ముందే తెలుసేమో.. భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తి ఒకరు వస్తారని, కఠినమైన మార్గాల తర్వాతే ఒక అద్భుతమైన ప్రదేశంలో అతను మనకు కనిపిస్తాడని, ఒకసారి అతన్ని చూశాక మర్చిపోవడం ఎవరికైనా కష్టమని ప్రకృతికి ముందే తెలిసినట్లుంది” అంటూ సెహ్వాగ్ ఎంతో భావోద్వేగంగా రాసుకొచ్చాడు. జూలై 7 మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పెట్టిన ఈ పోస్ట్‌కు కొద్ది గంటల్లోనే లక్షలాది లైకులు, కామెంట్లు వచ్చాయి.

భారత క్రికెట్ స్వర్ణయుగంలో ధోనీ, సెహ్వాగ్ మధ్య సంబంధాలు హెచ్చుతగ్గులతో సాగాయనేది జగమెరిగిన సత్యం. ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టులో ఫీల్డింగ్, ఫిట్‌నెస్ ప్రమాణాలను చాలా కఠినతరం చేశాడు. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లను రొటేషన్ పాలసీ పేరుతో పక్కన పెట్టాల్సి వచ్చింది, అందులో సెహ్వాగ్ కూడా ఉన్నాడు. 2007, 2008 ద్విపాక్షిక సిరీస్‌లలో సెహ్వాగ్‌ను కొన్ని మ్యాచ్‌లకు దూరం పెట్టారు. అప్పట్లో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ, తామిద్దరం ఎప్పుడూ శత్రువులుగా లేమని ఆ తర్వాత కాలంలో ఇద్దరూ స్పష్టం చేశారు. ధోనీ ఎప్పుడూ సెహ్వాగ్ దూకుడు బ్యాటింగ్ శైలిని మెచ్చుకునేవాడు, సెహ్వాగ్ కూడా ధోనీతో తనకున్న బంధం ఎప్పుడూ బాగుంటుందని చాలా సందర్భాల్లో చెప్పాడు.

ఇక ధోనీ కెరీర్ రికార్డులను చూస్తే, వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఓపెనర్‌గా గౌతమ్ గంభీర్ అత్యధికంగా 117 మ్యాచ్‌ల్లో 5,131 భాగస్వామ్య పరుగులు చేశాడు. అయితే ధోనీ కూడా సెహ్వాగ్‌తో కలిసి వేర్వేరు ఫార్మాట్లలో ఇన్నింగ్స్‌లు ఆడాడు. వీరిద్దరూ కలిసి 18 ఇన్నింగ్స్‌ల్లో 48.47 సగటుతో 824 పరుగులు జోడించారు. 45 ఏళ్లు పూర్తి చేసుకున్న ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించాల్సింది ఏమీ మిగల్లేదు. భారత జట్టుకు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మూడు వైట్-బాల్ ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌గా ఆయన రికార్డు సృష్టించాడు. తన కెరీర్‌లో 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 16 వేలకు పైగా పరుగులు చేసిన ధోనీ, భారత క్రికెట్‌లో ఒక సజీవ పురాణంగా నిలిచిపోయాడు. కాగా, సెహ్వాగ్ పెట్టిన ఈ అద్భుతమైన పోస్టుకు ధోనీ నుంచి ఇంకా ఎలాంటి రిప్లై రాలేదు. సాధారణంగా ధోనీ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడమే ఇందుకు కారణం కావచ్చు.

 

 

Follow Us