
Asia Cup 2026: దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 13న భారత్, శ్రీలంక జట్ల మధ్య మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ పోరు జరుగుతోంది. విజేతగా నిలిచే జట్టుకు ఏసీసీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ట్రోఫీ అందిస్తారా లేదా అనే అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఈ వేడుకపై అందరి దృష్టి నెలకొంది. గతేడాది జరిగిన పురుషుల ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. పహల్గామ్ దాడి ఘటన నేపథ్యంతో ఉత్పన్నమైన రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధినేత అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. ఆ సమయంలో నఖ్వీ విజేత ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ కప్పు ఇప్పటికీ భారత జట్టుకు అధికారికంగా అందకపోవడం గమనార్హం.
హర్మన్‌ప్రీత్ సేన ట్రోఫీ అందుకుంటుందా?
ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నఖ్వీనే కొనసాగుతున్నారు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టు, లంకపై గెలిచి ఛాంపియన్‌గా నిలిస్తే ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఒకవేళ టైటిల్ సాధిస్తే నఖ్వీ నుంచి ట్రోఫీ అందుకుంటుందా లేదా అన్నది క్రీడా వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో చోటుచేసుకున్న రాజకీయ సంఘర్షణల ప్రభావం ఈ ఫైనల్ ప్రజెంటేషన్ వేడుకపై కూడా పడే సూచనలు కనిపించాయి.
దుబాయ్‌లో నఖ్వీ గైర్హాజరు
ఈ ఉత్కంఠకు తెరదించుతూ దుబాయ్ నుంచి ఒక ముఖ్య వార్త బయటకు వచ్చింది. ఫైనల్ మ్యాచ్ ఆరంభ సమయానికి ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ దుబాయ్‌లో అందుబాటులో లేరని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి కొత్త వివాదాలకు తావివ్వకుండా ఉండేందుకే ఆయన ఈ పర్యటనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నఖ్వీ లేకపోవడంతో విజేతగా నిలిచే జట్టుకు ఏసీసీ ఉపాధ్యక్షుడు ఖలీద్ జరూనీ ట్రోఫీని అందజేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
టైటిల్ పోరులో భారత్, శ్రీలంక సత్తా
మరోవైపు మైదానంలో టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై 40 పరుగుల తేడాతో విజయం సాధించి పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. లంక జట్టు కూడా పాకిస్థాన్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో తుది పోరుకు అర్హత సాధించింది. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో ఉన్న భారత మహిళల జట్టు ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..