LSG vs GT: భీకర ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ దూరం! కారణం తెలిస్తే.. అయ్యో పాపం అంటారు!

ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్, వ్యక్తిగత కారణాల వల్ల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని కుమార్తె అనారోగ్యంతో ఉన్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. మార్ష్ లేకపోవడం లక్నోకు పెద్ద నష్టమని, పవర్ ప్లేలో వారి ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LSG vs GT: భీకర ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ దూరం! కారణం తెలిస్తే.. అయ్యో పాపం అంటారు!
Lsg Vs Gt

Updated on: Apr 12, 2025 | 4:26 PM

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కొంతమంది ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్నారు. అలా ఆడుతున్న వారిలో ఓ ప్లేయర్‌ తాజాగా ఓ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతను మరెవరో కాదు ఆసీస్‌ ప్లేయర్‌ మిచెల్‌ మార్ష్‌. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆడుతూ.. భీకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను వన్‌సైడ్‌ చేస్తున్న మార్ష్‌.. శనివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతను లేకుండానే ఎల్‌ఎస్‌జీ బరిలోకి దిగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. అతని కూతురు అనారోగ్యానికి గురవ్వడంతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని వెల్లడించాడు. ‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. చూడటానికి పిచ్ బాగుంది. గత రెండు మ్యాచ్‌లు గెలవడం హ్యాపీగా ఉంది. ఓ జట్టుగా మా ప్రాసెస్‌పై ఫోకస్ పెట్టాం. ప్రతీ ఆటగాడు అద్భుతంగా ఆడుతున్నాడు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. మా విజయాల క్రెడిట్ వారిదే.

ఈ మ్యాచ్‌కు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. అతని స్థానంలో హిమ్మత్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మిచెల్ మార్ష్ కూతురు అనారోగ్యానికి గురైంది.’అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. కాగా మిచెల్‌ మార్ష్‌ లేకపోవడం కచ్చితంగా లక్నోకు కాస్త ఇబ్బంది కరమైన అంశమే అని చెప్పాలి. ఎందుకంటే.. మార్ష్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో లక్నోకు మంచి స్టార్ట్‌ ఇస్తున్నాడు. మరి అతను లేకపోతే.. లక్నో పవర్‌ ప్లేలో ఎలా ఆడుతుందో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..