Sricharani: శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. రూ. 2.5 కోట్ల చెక్‌తోపాటు ఉద్యోగం..

Team India: కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహకాలు ప్రకటించింది. రూ.2.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని కేటాయించింది.

Sricharani: శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. రూ. 2.5 కోట్ల చెక్‌తోపాటు ఉద్యోగం..
Sricharani

Updated on: Dec 17, 2025 | 1:08 PM

అమరావతి: క్రీడారంగంలో రాణిస్తున్న యువ ప్రతిభకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన యువ మహిళా క్రికెటర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం తరపున భారీ ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేశారు. రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం నాడు శ్రీచరణిని సత్కరించి, రూ. 2.5 కోట్ల చెక్‌ను అందజేశారు. టీమిండియా అండర్-19 మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీచరణి ఒకరు. ఈ ఘనత సాధించినందుకు గాను గతంలో ప్రభుత్వం ఆమెకు నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఆ హామీని నెరవేరుస్తూ, ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ఆమెకు ఈ రివార్డును అందజేశారు.

కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహకాలు ప్రకటించింది. రూ.2.5 కోట్ల మేర నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖలో 500 గజాల విస్తీర్ణం గల ఇంటి స్థలాన్ని కేటాయించింది. డిగ్రీ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే..

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “తెలుగు అమ్మాయి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం మన రాష్ట్రానికి గర్వకారణం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. శ్రీచరణి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి,” అని ఆకాంక్షించారు. ఈ నగదు ప్రోత్సాహకం ఆమె భవిష్యత్ శిక్షణకు, క్రీడా అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రభుత్వం నుంచి ఇంతటి భారీ ప్రోత్సాహకం లభించడం పట్ల శ్రీచరణి, ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచినందుకు మంత్రి లోకేష్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి మరింతగా రాణిస్తానని శ్రీచరణి ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడా శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, శాప్ ఎండీ భరణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ డి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.