Virat Kohli: 6-7 సెలబ్రేషన్‌తో ఫేమస్.. ఇప్పుడు విరాట్ కోహ్లీనే ఫాలో అవ్వమంటున్న వైరల్ గర్ల్

Virat Kohli: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వినూత్న '6-7' సెలబ్రేషన్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మేధావి బిధూడీ వార్తల్లో నిలిచింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆమె చేసిన ఒక ఆసక్తికరమైన అభ్యర్థన క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Virat Kohli: 6-7 సెలబ్రేషన్‌తో ఫేమస్.. ఇప్పుడు విరాట్ కోహ్లీనే ఫాలో అవ్వమంటున్న వైరల్ గర్ల్
Virat Kohli (2)

Updated on: Aug 26, 2026 | 10:45 AM

Virat Kohli: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ (DPL) 2026లో తన వినూత్న 6-7 సెలబ్రేషన్‌తో ఒక్కసారిగా వైరల్ అయిన ఢిల్లీ లెగ్ స్పిన్నర్ మేధావి బిధూరి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె చేసిన రిక్వెస్ట్ ఏకంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకే. “విరాట్ కోహ్లీ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి” అనేది తన కోరిక అని మేధావి చెప్పింది. ఆగస్టు 20న జరిగిన మహిళల డీపీఎల్ మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ తరఫున బరిలోకి దిగిన మేధావి.. సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ బ్యాటర్ నిషికా సింగ్‌ను ఔట్ చేసింది. వికెట్ తీసిన వెంటనే ఆమె చేసిన 6-7 సెలబ్రేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ మ్యాచ్‌లో మేధావి 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. ఆమె టీమ్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, మేధావి మాత్రం తన సెలబ్రేషన్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఆ 6-7 సెలబ్రేషన్ వెనుక అసలు కథ ఇదే

మేధావి ధరించిన జెర్సీ నంబర్ 67. మొదట ఆమె 12వ నంబర్ జెర్సీ తీసుకోవాలనుకుందట. కానీ ఆ నంబర్ అప్పటికే వేరే ప్లేయర్‌కు ఉండటంతో 67ను ఎంచుకుంది. తన చెల్లెలి సూచనతో ట్రెండింగ్ 6-7ను తన వికెట్ సెలబ్రేషన్‌గా మార్చుకుంది. దీంతో జెర్సీ నంబర్, సెలబ్రేషన్ రెండూ సరిగ్గా సెట్ అయిపోయాయి. మేధావి సెలబ్రేషన్ ఎంత వైరల్ అయిందంటే.. టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతూ ఇదే ‘6-7’ సెలబ్రేషన్‌ను చేశాడు. లాంకషైర్ బ్యాటర్ జో మూర్స్‌ను ఔట్ చేసిన తర్వాత చాహల్ ఈ స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. దీంతో మేధావి సెలబ్రేషన్ మరింత క్రేజ్ సంపాదించింది.

కోహ్లీ నా ఫేవరెట్.. ఒక్కసారి ఫాలో అయితే చాలు

ఇక తనకు ఇష్టమైన క్రికెటర్ల గురించి మాట్లాడిన మేధావి.. విరాట్ కోహ్లీ, మిథాలీ రాజ్ తన రోల్ మోడల్స్ అని చెప్పింది. ఢిల్లీకి చెందిన తాను చిన్నప్పటి నుంచే కోహ్లీ ఆటను, ఫిట్‌నెస్‌ను ఫాలో అవుతున్నానని తెలిపింది. ఇప్పుడు తనకు ఉన్న ఓ చిన్న కోరికను కూడా బయటపెట్టింది. విరాట్ కోహ్లీ తనను సోషల్ మీడియాలో తిరిగి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది. కోహ్లీ తనను ఫాలో చేస్తే అది తనకు చాలా ప్రత్యేకమైన విషయమని మేధావి తెలిపింది.

RCBలో ఆడాలని డ్రీమ్

మేధావి బిధూరి ఇప్పటికే డబ్ల్యూపీఎల్ వేలం పూల్‌లో చోటు సంపాదించింది. భవిష్యత్తులో మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆడే అవకాశం వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన మొదటి ఎంపిక అని ఆమె వెల్లడించింది. విరాట్ కోహ్లీకి RCBతో ఉన్న అనుబంధం, ఆ జట్టు క్రేజ్ తనకు బాగా నచ్చుతాయని మేధావి చెబుతోంది. అంటే.. ముందు కోహ్లీ ఫాలో.. తర్వాత RCB జెర్సీ! అంటూ ఆమె అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఢిల్లీ క్రికెట్ నుంచి ఎదిగిన మేధావి

20 ఏళ్ల మేధావి బిధూరి ఢిల్లీ దేశవాళీ క్రికెట్‌లో కొంతకాలంగా కొనసాగుతోంది. ఢిల్లీ అండర్-19 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది. 2025 డీపీఎల్‎లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్ తరఫున ఆడిన ఆమె.. ఫైనల్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్‌పై 3/26తో కీలక ప్రదర్శన చేసి టైటిల్ గెలవడంలో జట్టు తరఫున మెరిసింది. ఇప్పుడు 2026 సీజన్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ తరఫున ఆడుతూ ‘6-7’ సెలబ్రేషన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక WPLలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న మేధావి.. కోహ్లీ ఫాలోబ్యాక్, RCB అవకాశం రెండింటినీ కలగా పెట్టుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us