Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ
ప్రస్తుతం ప్రొఫెషనల్ క్రికెట్‌లో వాడే ఇంగ్లీష్ విల్లో బ్యాట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల దిగువ స్థాయి క్రికెటర్లకు, గల్లీ క్రికెట్ ఆడేవారికి క్వాలిటీ బ్యాట్లను కొనుగోలు చేయడం భారంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన ఎంసీసీ, ఇకపై లోకల్ లీగ్స్, కింది స్థాయి మ్యాచ్‌లలో టైప్-డి లేదా లామినేటెడ్ బ్యాట్లను వాడొచ్చని స్పష్టం చేసింది.

Cricket Rules:క్రికెట్ ఆటకు సంబంధించి నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో నిషిద్ధంగా ఉన్న కొన్ని రకాల బ్యాట్లకు ఇప్పుడు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 3, మంగళవారం నాడు ఎంసీసీ ఏకంగా 73 రకాల మార్పులను ప్రకటించగా, అందులో బ్యాట్లకు సంబంధించిన నిబంధన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సామాన్యులకు, వర్ధమాన క్రీడాకారులకు క్రికెట్ ఆ ఆటను మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రొఫెషనల్ క్రికెట్‌లో వాడే ఇంగ్లీష్ విల్లో బ్యాట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల దిగువ స్థాయి క్రికెటర్లకు, గల్లీ క్రికెట్ ఆడేవారికి క్వాలిటీ బ్యాట్లను కొనుగోలు చేయడం భారంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన ఎంసీసీ, ఇకపై లోకల్ లీగ్స్, కింది స్థాయి మ్యాచ్‌లలో టైప్-డి లేదా లామినేటెడ్ బ్యాట్లను వాడొచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ బ్యాట్లను కేవలం అండర్-13 జూనియర్ క్రికెట్‌లో మాత్రమే అనుమతించేవారు, కానీ ఇప్పుడు అన్ని వయసుల వారు లోకల్ క్రికెట్‌లో వీటిని వాడవచ్చు. ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ఏమిటీ టైప్-డి బ్యాట్? ఎందుకంత స్పెషల్?
క్రికెట్ నిబంధనల ప్రకారం బ్యాట్లను నాలుగు రకాలుగా (Type A, B, C, D) విభజించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం టైప్-ఏ బ్యాట్లను మాత్రమే వాడుతున్నారు. ఇవి ఒకే చెక్క ముక్కతో తయారవుతాయి. అయితే ఇప్పుడు అనుమతినిచ్చిన టైప్-డి బ్యాట్లు మూడు వేర్వేరు చెక్క ముక్కలను కలిపి తయారు చేస్తారు. దీని ముందు భాగంలో ఇంగ్లీష్ విల్లో ఉన్నా, వెనుక వైపు తక్కువ ధరలో దొరికే కాశ్మీరీ విల్లో వంటి వాటిని వాడుతారు. దీనివల్ల బ్యాట్ నాణ్యత తగ్గకుండానే ధర గణనీయంగా తగ్గుతుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితి ఏంటి?
ఎంసీసీ నిబంధనలు మార్చినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్, ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో మాత్రం ఇప్పటికీ టైప్-ఏ బ్యాట్లను మాత్రమే వాడాలి. టైప్-డి బ్యాట్లను ఏ స్థాయిలో అనుమతించాలనేది ఆయా దేశాల క్రికెట్ బోర్డులు (ఉదాహరణకు బీసీసీఐ) నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ మార్పు వల్ల దేశీయ క్రికెట్‌లో చిన్న స్థాయి క్రీడాకారులకు ఆర్థిక భారం తగ్గి, మరింత మంది ఆట వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేవలం బ్యాట్లే కాకుండా, క్రీడలో పారదర్శకత కోసం ఎంసీసీ మొత్తం 73 నిబంధనలను సవరించింది. క్రికెట్ సామగ్రి ధరలు పెరుగుతున్న తరుణంలో, సామాన్యులకు ఆటను దూరం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 2026 చివరి నాటికి గల్లీ క్రికెట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవల్ క్రికెట్ వరకు ఈ టైప్-డి బ్యాట్ల హడావుడి కనిపించబోతోంది. ఇది ఖచ్చితంగా క్రికెట్ పరికరాల మార్కెట్‌లో పెను మార్పులకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
