శ్రీలంక టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో గ్లెన్ మాక్స్‌వెల్‌కు స్థానం దక్కలేదు. అయితేనేం బిగ్ బాష్ లీగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు మ్యాక్స్‌వెల్. ఈ టోర్నీలో మాక్స్‌వెల్ సిడ్నీ సిక్సర్స్ బౌలర్లను చిత్తు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 32 బంతుల్లో అజేయంగా 58 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ మూడింటిలో ఒక సిక్స్ అయితే ఎవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్ అనాల్సిందే. ఆ వీడియో చూస్తే మీరూ వావ్ అంటారు.
మెల్‌బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో బెన్ డ్వోర్టియస్ వేసిన బంతికి మ్యాక్స్‌వెల్ అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. ఈ బాల్ ఫుల్ టాస్ కాగా.. దానిని స్ట్రెయిట్‌గా లాంగ్ ఆన్ ఆడేందుకు బదులుగా, మాక్స్‌వెల్ రివర్స్ ల్యాప్ షాట్ ఆడాడు. దానిని సిక్సర్‌గా మలిచాడు. మాక్స్‌వెల్ తరచూ ఇలాంటి షాట్‌లు ఆడుతూ బిగ్ బాష్ లీగ్‌లో మరోసారి తన మ్యాజిక్‌ను చూపించాడు. మాక్స్‌వెల్ అలాంటి రిస్కీ షాట్లు ఆడడమే కాకుండా జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చేసరికి మెల్‌బోర్న్ స్టార్స్ పేలవమైన స్థితిలో ఉంది. ఆ జట్టు 9.3 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. డకెట్, స్టోయినిస్ వంటి ఆటగాళ్లు కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ 32 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో రాణించి జట్టు స్కోరును 156 పరుగులకు చేర్చాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచాడు. అతను 6 మ్యాచ్‌ల్లో 32.75 సగటుతో 131 పరుగులు చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 8 ఫోర్లు కొట్టాడు. ఈ గణాంకాలు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు అద్భుతమైనవి. అయితే టెస్టు జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లేకపోవడం మ్యాక్స్‌వెల్‌కు మాత్రం కచ్చితంగా బాధ కలిగించే అంశమే. అయితే యంగ్ ప్లేయర్స్‌ని కాదని మాక్స్‌వెల్‌ను టెస్టు జట్టులోకి ఎంపిక చేస్తే అది కాస్తా రాంగ్ డెసిషన్ అవుతుందని పాంటింగ్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి