AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Match Fixing : ఓ వైపు వరల్డ్ కప్ వివాదం..మరోవైపు ఫిక్సింగ్ కలకలం..క్రికెట్లో దేశం పరువు నిలువునా తీస్తున్నారుగా

BCB :బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరోసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. భారత క్రికెట్‌పై విమర్శలు చేయడంలో ముందుండే బంగ్లాదేశ్, ఇప్పుడు తన సొంత గడ్డపై జరుగుతున్న లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‎లో జరిగిన ఒక కీలక మ్యాచ్ ఫలితం ముందే నిర్ణయించబడిందని స్వయంగా ఆ టీమ్ అధికారి ఒకరు బయటపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Match Fixing : ఓ వైపు  వరల్డ్ కప్ వివాదం..మరోవైపు ఫిక్సింగ్ కలకలం..క్రికెట్లో దేశం పరువు నిలువునా తీస్తున్నారుగా
Bangladesh Cricket Fixing Scandal
Rakesh
|

Updated on: Jan 22, 2026 | 4:24 PM

Share

Match Fixing : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ‎లో జనవరి 21న జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఒక పెద్ద కుంభకోణానికి వేదికైంది. సిల్హెట్ టైటాన్స్, రాజ్‌షాహి వారియర్స్ మధ్య జరిగిన ఈ పోరులో సిల్హెట్ జట్టు 12 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ ఓటమి సహజంగా జరిగింది కాదని, తమ జట్టులోని ఒక కీలక ఆటగాడు ఫిక్సింగ్‌కు పాల్పడి జట్టును మోసం చేశాడని సిల్హెట్ టైటాన్స్ టీమ్ సలహాదారు ఫహీమ్ అల్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆవేదనతోనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ సోషల్ మీడియా వేదికగా అసలు నిజాన్ని వెల్లడించారు.

ఫహీమ్ అల్ చౌదరి తన ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. “ఈ రోజు మ్యాచ్ కల్తీ అయింది. మా జట్టులోని ఒక ఆటగాడు తనను తాను అమ్ముకున్నాడని నాకు సమాచారం అందింది. అతను మాతో అబద్ధాలు చెప్పి సిల్హెట్ టైటాన్స్ జట్టును, సిల్హెట్ ప్రజల భావోద్వేగాలను మోసం చేశాడు. అతనికి డబ్బు కావాలంటే నన్ను అడగాల్సింది, మేమే ఏర్పాటు చేసేవాళ్లం. కానీ ఇలా జట్టుకు ద్రోహం చేయడం నన్ను తీవ్రంగా కలచివేసింది” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును డిఫెన్స్‌లో పడేశాయి.

ఆ మ్యాచ్‌లో జరిగిన విచిత్రమైన పరిణామాలు కూడా ఈ ఫిక్సింగ్ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రాజ్‌షాహి వారియర్స్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిల్హెట్ టైటాన్స్ 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. అంటే చివరి 42 బంతుల్లో కేవలం 60 పరుగులు మాత్రమే కావాలి. టీ20 క్రికెట్‌లో ఇది చాలా సులభమైన లక్ష్యం. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. 16.3 ఓవర్ నుంచి 17.3 ఓవర్ మధ్యలో సిల్హెట్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. చివరికి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. గెలిచే మ్యాచ్‌ను కావాలనే చేజార్చుకున్నట్లు కనిపించడంతో అనుమానాలు నిజమయ్యాయి.

ప్రస్తుతం 2026 టీ20 వరల్డ్ కప్ వేదిక మార్పు విషయంలో ఐసీసీతో, భారత్‌తో గొడవ పడుతున్న బంగ్లాదేశ్ బోర్డుకు, ఈ ఫిక్సింగ్ వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. సొంత లీగ్ లోనే పారదర్శకత లేకపోతే అంతర్జాతీయ స్థాయి టోర్నీలను ఎలా నిర్వహిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీసీబీ ఈ విషయంలో విచారణ జరుపుతామని చెబుతున్నప్పటికీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఫిక్సింగ్ మరక బంగ్లాదేశ్ క్రికెట్ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు దెబ్బతీసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..