
ఐపీఎల్ 2025 ఫైనల్ సమీపిస్తున్న కొద్దీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు మళ్లీ టైటిల్ కలను నిజం చేసేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని ఎదుర్కొంటోంది. కానీ, విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యంలోని ఈ జట్టుపై ఇప్పుడు సంఖ్యాశాస్త్రం, గ్రహాల ప్రభావం పై శంకలు మొదలయ్యాయి. ఐపీఎల్‌లో ఫామ్, వ్యూహం, నైపుణ్యం ఎంత ముఖ్యమైనవో, కొంతమంది అభిమానుల విశ్వాసంలో సంఖ్యాశాస్త్రం కూడా అంతే బలంగా నిలిచింది. ఈ నేపథ్యంలో RCBకి “రెడ్ అలర్ట్” అంటూ హెచ్చరికలు వినిపిస్తున్నాయి, అది కేవలం ఆత్మవిశ్వాసం పట్ల కాకుండా అంకెల మాయాజాలం పట్ల కూడా.
RCBకి ఎరుపు రంగు జెర్సీ ప్రధాన గుర్తింపుగా ఉంటుంది. కానీ IPL చరిత్రలో ఇప్పటివరకు ఎరుపు రంగు జెర్సీ ధరించిన ఏ జట్టూ ట్రోఫీని గెలవలేదు. RCB ఇప్పటికే మూడుసార్లు ఫైనల్‌కు చేరినా, ప్రతిసారీ టైటిల్ దగ్గరే ఓడిపోయింది. అదే విధంగా పంజాబ్ కింగ్స్ కూడా ఎరుపు రంగుతోనే ఆటలో పాల్గొంటూ టైటిల్‌ను అందుకోలేకపోయారు. ఈ ఏడాది (2025) సంఖ్యాపరంగా 2+0+2+5 = 9గా వచ్చే నంబర్‌కి అంగారక గ్రహం అధిపతి. ఇక ఫైనల్ జూన్ 3న జరగనుంది, ఇది కూడా 3+6 = 9గా సరిపోతుంది. ఈ సంఖ్య “మార్స్” లేదా అంగారకుని సూచిస్తుంది. అది దూకుడు, స్పూర్తి, ఆకస్మిక మలుపులు, ఆసక్తికరమైన సంఘటనలతో నిండిన గ్రహం.
RCB ఆట శైలిలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి – అత్యధిక రిస్క్‌తో పాటు అత్యధిక ప్రతిఫలం కోరే ప్రదర్శనలు, హృదయ విదారక పరాజయాలు, అస్థిరంగా మారే పరిస్థితులు. అయితే ఈ సీజన్‌లో మాత్రం పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, బౌలింగ్ యూనిట్ సజావుగా నడుస్తోంది. రజత్ పాటిదార్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లు దూకుడుతో ఆడుతూ జట్టుకు స్థిరత్వాన్ని అందిస్తున్నారు.
ఇకపోతే న్యూమరాలజీ నిపుణులు కూడా ఈ అంశాన్ని విపులంగా విశ్లేషిస్తున్నారు. ప్రముఖ నిపుణుడు సంజయ్ బి జుమానీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, టైటిల్ పోరులో ఎరుపు రంగు కంటే నీలం రంగు గల జట్లకే అధిక అవకాశాలున్నాయని సూచించారు. అంటే, ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరితే RCB అభిమానులకు గుండెలో గుబులు మొదలవుతుందని అర్థం.
ఇక్కడ ఇంకొక ఆసక్తికర విషయమేమిటంటే, విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 – ఇది కూడా 1+8 = 9కి సరిపోతుంది. ఈ ఐపీఎల్ కూడా 18వ ఎడిషన్, అదే సంఖ్య మరోసారి 9కి చేరుతోంది. ఇది అంగారక గ్రహం ఆధిపత్యానికి సంకేతంగా నిలుస్తోంది. అంటే, అంగారకుడు ఇప్పటి వరకు RCBకి నిరాశను తీసుకొచ్చినా, ఈసారి మాత్రం అతని అనుగ్రహం కీర్తిని అందిస్తుందా? అని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఈ సంఖ్యల సందేశం కేవలం మూఢనమ్మకం అనిపించినా కూడా, RCB అభిమానులకు ఇది ఒక తీయని ఉత్కంఠ. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టైటిల్ గెలుపు ఈ సారి సాధ్యమవుతుందా? అంగారకుడి నీడ వల్ల ఇది మరోసారి అర్ధాంతరంగా ఆగిపోతుందా? అనే ప్రశ్నలు క్రికెట్ అభిమానుల మదిలో తిరుగుతున్నాయి. ఒకవేళ ఈసారి కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సిబి విజయం సాధిస్తే, అది కేవలం ఆటలో మాత్రమే కాక, అంకెల శాపాన్ని కూడా చెరిపేసిన ఘనతగా నిలుస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..