
Shaheen Afridi Injured Ahead of T20 World Cup 2026: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సిద్ధమవుతున్న పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్, మాజీ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL) మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా అతను మైదానం నుంచి కుంటుకుంటూ వెళ్లడం ఇప్పుడు పాక్ అభిమానులను, క్రికెట్ బోర్డును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL 2025-26)లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షాహీన్ అఫ్రిదీ, శనివారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.
స్ట్రైకర్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో జేమీ ఓవర్టన్ కొట్టిన బంతిని ఆపే క్రమంలో మిడ్-ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అఫ్రిదీ వేగంగా పరిగెత్తాడు. ఆ సమయంలో అతని కుడి మోకాలికి గాయమైంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ మైదానంలోనే కూలబడిన అఫ్రిదీ, ఆ తర్వాత ఫిజియో సాయంతో కుంటుకుంటూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. అతను తన కోటా ఓవర్లను కూడా పూర్తి చేయలేకపోయాడు.
2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. టోర్నీ ప్రారంభానికి కేవలం కొన్ని వారాల సమయం మాత్రమే ఉండటంతో, అఫ్రిదీ గాయం పాకిస్తాన్ అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. అఫ్రిదీ ఇప్పటికే గతంలోనూ మోకాలి గాయంతో చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. మళ్లీ అదే చోట గాయం కావడం ఆ జట్టు బౌలింగ్ విభాగంపై ఆందోళన పెంచుతోంది.
ఈ సీజన్ బిగ్ బాష్ లీగ్‌లో అఫ్రిదీ ఫామ్ అంత ఆశాజనకంగా లేదు. మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ప్రమాదకరమైన బౌలింగ్ (బీమర్లు) చేసినందుకు అంపైర్లు అతడిని బౌలింగ్ నుంచి తప్పించారు. తాజా మ్యాచ్‌లో కూడా అతను 3 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇటు ఫామ్ లేమి, అటు గాయంతో సతమతమవుతున్న అఫ్రిదీ త్వరగా కోలుకోవాలని పాక్ బోర్డు కోరుకుంటోంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ప్రస్తుతం అఫ్రిదీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నివేదిక కోసం వేచి చూస్తోంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే, ప్రపంచకప్ కోసం పాక్ జట్టు ప్రత్యామ్నాయ బౌలర్ల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..