క్రికెట్‌లో ఫీల్డ్ సెట్(cricket fields set) చేయడమన్నది కొంచెం క్లిష్టమైనదే! అనుభవజ్ఞులైన సారథులే అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తుంటారు. ఒక్కోసారి సింగిల్ పరుగు కూడా గెలుపు అవకాశాలను జారవిడుస్తుంటాయి. ప్రత్యర్థులకు సింగిల్ కూడా ఇవ్వకూడదనుకున్నప్పుడు అఫన్సీవ్ ఫీల్డ్‌ను సెట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి సమయాల్లో దూకుడుగా వ్యవహరించాలి. ఈ సందర్భమే కాదు, బౌలర్ హ్యాట్రిక్ మీద ఉన్నప్పుడు, విజయానికి దరిదాపుల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కంగారుపడేట్టు, అయోమయం చెందేట్టు కెప్టెన్ ఫీల్డ్ సెట్ చేస్తాడు. అంటే తొమ్మిది మంది ఫీల్డర్లు బ్యాట్స్‌మన్ దగ్గర మోహరిస్తారు. ఇలాంటి ఫీల్డింగ్ సెటప్‌ను అంబ్రెల్లా ఫీల్డ్ అంటారు. పాత కాలం ఇలాంటి గొడుగు ఫీల్డ్ తరచూ కనిపించేది. ఇప్పుడు చాలా అరుదుగా ఆ రకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
1. 1976-77లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన సిరీస్ అది. న్యూజిలాండ్‌కు చెందిన 11వ నంబర్ బ్యాట్స్‌మన్ పీటర్ పెథెరిక్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే ఆస్ట్రేలియా విజయం ఖరారయ్యింది. డెన్నిస్ లిల్లీ బౌలింగ్‌లో కెప్టెన్ చాపెల్ తొమ్మిది స్లిప్స్ పెట్టాడు.
2.1999-2000 నాటి ముచ్చట. ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య వన్డే పోరు. ఆ సమయంలో ఆస్ట్రేలియా టీమ్ ఎంత బలంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా అంబ్రెల్లా ఫీల్డింగ్‌ను సెట్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. టైలెండర్లు బ్యాటింగ్ వచ్చే సమయానికే ఆస్ట్రేలియా విజయం ఖరారయ్యింది. అందుకే స్టీవ్ వా తొమ్మిది స్లిప్పులు పెట్టాడు. ఈ ఫోటోలో మొత్తం ఆసీస్ జట్టంతా కనిపిస్తుంది చూడండి. కీపర్, బౌలర్ మినహా మిగతా వారంతా స్లిప్స్‌లోనే ఉన్నారన్నమాట! అన్నట్టు బౌలర్ పేరు చెప్పలేదు కదూ! డామియన్ ఫ్లెమింగ్..
3.2007-2008 నాటి సంగతి. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్. మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇషాంత్ శర్మ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇషాంత్ బ్యాటింగ్‌కు దిగే సమయానికే ఇండియా ఓటమి అంచున ఉంది. శర్మను మరింత కంగారు పెట్టేందుకు ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఫీల్డర్లను బ్యాట్స్‌మన్‌కు దగ్గరగా రమ్మన్నాడు. ఇలా ఫీల్డర్లంతా దగ్గరగా కాచుకుని ఉంటే ఏ బ్యాట్స్‌మన్‌కు అయినా బెరుకు ఉండదా చెప్పండి!
4. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య 1932-33లో జరిగిన యాషెస్ సిరీస్ జెంటిల్మన్ క్రికెట్‌లో మాయని మచ్చగా మిగిలింది. ఎలాగైనా సిరీస్ గెలవాలన్న పంతంతో ఇంగ్లాండ్ కెప్టెన్ డగ్లస్ జార్డన్ బాడీలైన్ బౌలింగ్‌ను రచించాడు. బ్యాట్స్‌మెన్ శరీరంపైకి బంతులను విసరాల్సిందిగా బౌలర్లను ఆదేశించాడు. అతడి పన్నాగానికి ఎంతో మంది గాయాల పాలయ్యారు. డగ్లస్ జార్డన్‌పై అనేక విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఆ సిరీస్‌దే!
5. మార్చి 26, 2013. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు. ఇంగ్లాండ్ ఓటమి అంచున ఉంది. న్యూజిలాండ్ విజయానికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మాట్ ప్రియర్ అడ్డుగోడలా నిలిచాడు. గెలిచే మ్యాచ్ చేజారిపోతున్నదేనన్న బాధ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్‌ది! అయినా సరే ప్రయత్నించి చూద్దామనుకున్నాడు. ప్రియర్ చుట్టూ ఫీల్డర్లను మోహరింపచేసి ప్రత్యేకమైన ఫీల్డ్ సెట్‌కు డిజైన్ చేశాడు. అయినా ప్రియర్ ఏకాగ్రత కోల్పోలేదు. అఖరి బంతి వరకు అజేయంగా నిలిచి జట్టును ఓటమి నుంచి రక్షించాడు.
ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ పిట్ట.. 44 బిలియన్ డాలర్లకు డీల్..
Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..