KL Rahul: క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించడం ప్రతీ క్రికెటర్ కల. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో ఈ మైదానంలో సెంచరీ చేయలేకపోయాడు. కానీ, భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. ఒకప్పుడు రాహుల్ భారత టెస్ట్ జట్టులో కీలక ప్లేయర్‌గా ఉండేవాడు. కానీ, అతను పేలవమైన ఫామ్ కారణంగా టీం నుంచి కొంతకాలంగా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం రాహుల్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. తొలి టెస్టులోనూ అర్థ శతకం సాధించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్ జట్టుకు దూరంగా ఉన్న సమయాన్ని గుర్తు చేసుకున్నాడు.
రెండేళ్ల క్రితం టెస్టు జట్టు నుంచి తొలగించడం బాధ కలిగించిందని, అయితే ఇంగ్లండ్ పర్యటనలో బలమైన పునరాగమనం కోసం చాలా కష్టపడ్డానని రాహాల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 129 పరుగులు చేసిన 29 ఏళ్ల రాహుల్ గత విషయాల గురించి ఆలోచించనని తెలిపాడు. అదే సమయంలో, అతను జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తు్న్నట్లు తెలిపాడు.
తోటి ఓపెనర్ రోహిత్ శర్మతో రాహుల్ మాట్లాడుతూ, “టెస్టు జట్టు నుంచి తప్పుకోవడం నిరాశపరిచింది. అది చెప్పుకోలేని బాధ కలిగించింది. కానీ, దానికి నేనే కారణం. నేను అవకాశం కోసం వేచి ఉన్నాను. అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవాలి. లేదంటే జట్టులో చోటు కష్టమవుతోంది. నేను నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. లార్డ్స్‌లో సెంచరీ ఎంతో ప్రత్యేకమైంది. నేను గతం గురించి ఆలోచించను. కానీ, ఆ సమయంలో నేను పడ్డ ఇబ్బందితోనే ఇప్పుడు రాణిస్తున్నానను. దానిని ఓ ఆయుధంలా వాడుకుని పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాను. ఆ నొప్పే నన్ను మరింత కష్టపడటానికి ప్రేరేపించింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. నేను దీనిని వృధా చేయకూడదనుకుంటున్నాను” అని సెంచరీ వీరుడు చెప్పుకొచ్చాడు.
ఈ మనస్తత్వాన్ని వదలాలి..
ఇంగ్లండ్ పర్యటనకు ముందు, రాహుల్ 2019 ఆగస్టులో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో తన చివరి టెస్టు ఆడాడు. టెస్టు క్రికెట్‌కు దూరమైన రెండేళ్ల కాలంలో అతను ఎలాంటి మార్పులు చేశావని అడిగినప్పుడు.. ప్రతీ బంతికి పరుగులు చేసే మనస్తత్వాన్ని అధిగమించగలిగానని చెప్పాడు. “జట్టు నుంచి తొలగించడానికి ముందు, నేను దక్షిణాఫ్రికాలో, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో విభిన్న పరిస్థితులలో ఆడాను. నేను మొదటిసారిగా ఈ దేశాల్లో పర్యటించాను. నా మనస్సు స్థిరంగా లేదని నేను భావించాను. ప్రతీ బంతికి రెండు షాట్లు ఉన్నాయని నేను అనుకున్నాను. నేను ఎల్లప్పుడూ పరుగుల గురించే ఆలోచించాను” అంటూ ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు.
“ఈసారి నేను పరుగుల గురించి ఆలోచించలేదు. కేవలం బంతిని ఆడేందుకు మాత్రమే ప్రయత్నించాను. ఇది ఒక్క రాత్రిలో జరగలేదు. ఈ రెండేళ్లలో ఎందరో బ్యాట్స్‌మెన్‌ల ఆటను చూశాను. అలాగే ప్రాక్టీస్ చేశాను. ఈ ప్రక్రియలో ఓ బ్యాట్స్‌మన్ పరుగులు సాధిస్తూ.. ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడో గమనించాను. ప్రస్తుతం నా ఆటతో సంతోషంగా ఉన్నాను” అంటూ వివరించాడు.
లార్డ్స్‌లో శతకంపై మాట్లాడుతూ..
లార్డ్స్‌లో సెంచరీ గురించి రాహుల్ మాట్లాడుతూ, “ఇది ఎంతో ప్రత్యేకమైనది. లార్డ్స్‌లో ఇది నా తొలి సెంచరీ. ఎంతో ఆనందాన్ని అందించింది. నేను ఓ బెస్ట్ టెస్ట్ క్రికెటర్ కావాలనుకున్నాను. నా తండ్రికి కూడా టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా కోచ్ ఎప్పుడూ టెస్ట్ క్రికెట్‌లో బాగా రాణించాలని కోరుకుంటాడు” అని పేర్కొన్నాడు.
రాహుల్ ఇన్నింగ్స్‌ని ప్రశంసిస్తూ రోహిత్ ఇలా అన్నాడు.. “రాహుల్ ఇలా ఆడడాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఎంతో సహనం చూపిస్తూ.. చాలా సౌలభ్యంగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా ఈ రకమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించాడు. ఇది జట్టుకి గొప్ప భాగస్వామ్యం” అని తెలిపాడు.
Also Read: IND vs ENG: రాహుల్‌పై షాంపైన్ కార్క్‌లను విసిరిన ప్రేక్షకులు.. ఘాటుగా స్పందించిన కోహ్లీ..!
Viral Video: నీరజ్ చోప్రాలో దాగి ఉన్న మరో టాలెంట్.. వీడియోలో దుమ్మురేపిన గోల్డెన్ బాయ్