22 సిక్స్‌లు, 12 ఫోర్లతో చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ స్కోర్..

Kolkata Knight Riders vs Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫిన్ అలెన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు అంగ్క్రిష్ రఘువంశీ, కెమెరాన్ గ్రీన్ మెరుపులు తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది.

22 సిక్స్‌లు, 12 ఫోర్లతో చెలరేగిన కేకేఆర్ బ్యాటర్లు.. గుజరాత్ ముందు భారీ స్కోర్..
Gt Vs Kkr Score

Updated on: May 16, 2026 | 9:55 PM

Kolkata Knight Riders vs Gujarat Titans: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుని కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌పై ఉన్న తేమను వాడుకుని కోల్‌కతాను తక్కువ స్కోరుకే పరిమితం చేయవచ్చనే గుజరాత్ వ్యూహాలను కేకేఆర్ ఓపెనర్లు పూర్తిగా తిప్పికొట్టారు. క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుంచే గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. మైదానంలో నలుమూలలా షాట్లు బాదుతూ పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 248 పరుగుల టార్గెట్ నిలిచింది.

21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఫిన్ అలెన్ సిక్సర్ల వేట..

కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ క్రీజులో ఉన్నంతసేపు సిక్సర్ల సునామీ సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే అర్థ సెంచరీ మార్కును దాటిన అలెన్, మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 10 భారీ సిక్సర్ల సాయంతో 93 పరుగులు సాధించాడు. 273.53 స్ట్రైక్ రేట్‌తో గుజరాత్ బౌలింగ్ లైనప్‌ను ముక్కలు చేశాడు. రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ వేసిన ఓవర్లో 16 పరుగులు రాగా, అర్షద్ ఖాన్ ఓవర్లో ఏకంగా 22 పరుగులు పిండుకుని స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అలెన్ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ 11 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 138 పరుగులు చేసి భారీ స్కోరుకు పునాది వేసింది.

బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రఘువంశీ, కెమెరాన్ గ్రీన్..

ఫిన్ అలెన్ అవుట్ అయిన తర్వాత కూడా కోల్‌కతా రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు. యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపించాడు. 44 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా వచ్చిన కెమెరాన్ గ్రీన్ కూడా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి ధాటికి కేకేఆర్ రన్ రేట్ 12.35గా నమోదైంది.

తేలిపోయిన గుజరాత్ బౌలింగ్ లైనప్..

కేకేఆర్ బ్యాటర్ల దెబ్బకు గుజరాత్ ప్రధాన బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 57 పరుగులు సమర్పించుకున్నాడు. అర్షద్ ఖాన్, సాయి కిషోర్ వంటి బౌలర్లు ఇన్నింగ్స్ వేగాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us