భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముగిసింది. ఈ సమావేశంలో బీసీసీఐ కొత్త ఆఫీస్ బేరర్ల ప్రకటనతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళల ఐపీఎల్ నిర్వహణకు అంగీకరించడం అత్యంత కీలకమైన నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. దక్షిణ ముంబైలోని 5-స్టార్ హోటల్‌లో జరిగిన బీసీసీఐ 91వ వార్షిక సమావేశంలో ఇతర కీలక నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. BCCI కొత్త ఆఫీస్ బేరర్లు ఎన్నికయ్యారు. రోజర్ బిన్నీ అధ్యక్షుడిగా, రాజీవ్ శుక్లా వైస్ ప్రెసిడెంట్‌గా, జైషా కార్యదర్శిగా, దేవ్‌జిత్ సైకా సహ కార్యదర్శిగా, ఆశిష్ షెలార్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు.
2. మహిళల ఐపీఎల్‌కు బీసీసీఐ జనరల్ బాడీ ఆమోదం తెలిపింది.
3. పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (2023-27), ఉమెన్స్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (2022-25) కూడా ఆమోదం పొందాయి.
4. 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఆమోదించారు.
5. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ చేసిన ఖాతా ఆమోదించారు.
6. MJK మజుందార్ BCCI అపెక్స్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.
7. అరుణ్ సింగ్ ధుమాల్, అవిషేక్ దాల్మియా IPL గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.
8. బీసీసీఐ జనరల్ బాడీ గత పదవీ కాలం నుంచి అందించిన సేవలకు బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫీస్ బేరర్‌లకు ధన్యవాదాలు తెలిపింది.
వచ్చే ఏడాది పురుషుల ఐపీఎల్ కంటే ముందు మార్చిలో మహిళల ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ ఐపీఎల్‌లో ఐదు జట్లు పాల్గొంటాయనే విషయం తెరపైకి వచ్చింది. టోర్నీలో మొత్తం 20 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో అన్ని జట్లు వేరే టీంతో 2 సార్లు తలపడతాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో ఆడతాయి.