Kevin Pietersen : కాస్త సర్ఫరాజ్‎ను చూసి నేర్చుకోవయ్యా.. పృథ్వీ షాకు పీటర్సన్ సలహా

సర్ఫరాజ్ ఖాన్ 17 కిలోల బరువు తగ్గి అద్భుతమైన ఫిట్‌నెస్‌ను ప్రదర్శించాడు. ఈ ఫోటోను చూసిన కెవిన్ పీటర్సన్, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న పృథ్వీ షాకు ఇది ఒక స్ఫూర్తి కావాలని కోరాడు. సర్ఫరాజ్ కృషి, పీటర్సన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kevin Pietersen : కాస్త సర్ఫరాజ్‎ను చూసి నేర్చుకోవయ్యా.. పృథ్వీ షాకు పీటర్సన్ సలహా
Kevin Pietersen

Updated on: Jul 22, 2025 | 3:04 PM

Kevin Pietersen : సర్ఫరాజ్ ఖాన్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 తర్వాత భారత టెస్ట్ జట్టు నుంచి బయటపడ్డాడు. ఆస్ట్రేలియాలో అతనికి ఆడే అవకాశం కూడా రాలేదు. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతనిని సెలక్ట్ చేయలేదు. జట్టు నుంచి బయటపడిన తర్వాత సర్ఫరాజ్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కేవలం రెండు నెలల్లోనే 17 కిలోల బరువు తగ్గించుకున్నాడు. అతని ఈ కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్, ఈ ఫోటోను పృథ్వీ షాకు చూపించాలని అన్నారు.

సర్ఫరాజ్ జట్టు నుంచి బయటపడిన తర్వాత చాలా కష్టపడ్డాడు. సోమవారం, జూలై 21న సర్ఫరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తాను 17 కిలోల బరువు తగ్గినట్లు షేర్ చేశాడు. దీంతో అతని ఫిట్‌నెస్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్, సర్ఫరాజ్ ఫోటోను పృథ్వీ షాకు చూపించాలని సూచించాడు. కాగా, పృథ్వీ షా కూడా గతంలో ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ముంబై జట్టు నుంచి తనను తప్పించాల్సి వచ్చింది. షా బరువు కూడా చాలా పెరిగిందని అందరికీ తెలిసిందే.

పీటర్సన్ తన ‘X’లో పోస్ట్ చేస్తూ.. అద్భుతమైన ప్రయత్నం, యంగ్ మ్యాన్! అభినందనలు. ఇది మైదానంలో మెరుగైన ప్రదర్శనలకు దారి తీస్తుందని నేను అనుకుంటున్నాను. మీ ప్రాధాన్యతలను మళ్ళీ మార్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఎవరైనా దీన్ని పృథ్వీ షాకు కూడా చూపించండి. ఇది సాధ్యమేనని పేర్కొన్నాడు.

పృథ్వీ షా గత నాలుగు సంవత్సరాలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను చివరిసారిగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ తరపున ఆడాడు. ఆ తర్వాత అతను ఐపీఎల్‌లో ఆడుతూ కనిపించాడు.. కానీ మొదట ఫిట్‌నెస్ కారణాలతో ముంబై జట్టు షా ను తప్పించింది. ఆ తర్వాత ఐపీఎల్ 2025 వేలంలో కూడా షాకు కొనుగోలుదారులు ఎవరూ దొరకలేదు. సర్ఫరాజ్ ఫిట్‌నెస్ స్ఫూర్తి పృథ్వీ షా కు కూడా ఉపయోగపడుతుందా అనేది చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..