
Jasprit Bumrah : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచులో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సౌతాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా బుమ్రా ఒక అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ ఒక్క బౌల్డ్‌తో బుమ్రా, భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఒక రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు, ఇప్పుడు బుమ్రా దృష్టి దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేల రికార్డులపై పడింది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఓపెనింగ్ జోడీ ఎడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ తొలి 10 ఓవర్లలో 50 పరుగులు దాటించి దూకుడుగా ఆడింది. 11వ ఓవర్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రంగంలోకి దిగి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ వికెట్‌తో బుమ్రా టెస్ట్ కెరీర్‌లో 152వ సారి బ్యాట్స్‌మన్‌ను బౌల్డ్ చేశాడు. దీని ద్వారా అతను మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (151 బౌల్డ్ వికెట్లు) రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు బ్యాట్స్‌మన్‌ను బౌల్డ్ చేసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ఇప్పుడు మూడవ స్థానంలో నిలిచాడు.
అశ్విన్ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా, ఇప్పుడు భారత దిగ్గజాలు అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ రికార్డులను అధిగమించే దిశగా పయనిస్తున్నాడు. బూమ్రాకు ఇంకా క్రికెట్ కెరీర్‌లో చాలా కాలం ఉంది కాబట్టి, అతను ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
బౌలింగ్ ద్వారా ఒక భారతీయుడు తీసిన అత్యధిక వికెట్లు –
186 – అనిల్ కుంబ్లే
167 – కపిల్ దేవ్
152 – జస్ప్రీత్ బుమ్రా*
151 – ఆర్ అశ్విన్
145 – రవీంద్ర జడేజా
142 – జహీర్ ఖాన్
136 – మహ్మద్ షమీ
125 – జవగల్ శ్రీనాథ్
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఏకంగా నలుగురు స్పిన్నర్లను (వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్) ఎంచుకోవడం సంచలనంగా మారింది. సాయి సుదర్శన్‌ను జట్టు నుంచి తప్పించారు.
సౌతాఫ్రికా (ప్లేయింగ్ ఎలెవన్): ఎడెన్ మార్క్రమ్, రయాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరిన్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్.
భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ (నం.3 బ్యాటర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..