Jake Fraser-McGurk: ఆస్ట్రేలియాకు బుద్ధి లేదని అనుకున్నాం..కానీ, మనకే లేదని అర్థమైంది!

జేక్ ఫ్రేజర్ ఐపీఎల్ 2024లో అద్భుతంగా ఆడినప్పటికీ, ప్రస్తుత సీజన్‌లో పేలవంగా ఆడుతున్నాడు. అతని అగ్రెసివ్‌ బ్యాటింగ్ శైలి విఫలమవుతోంది. ఆస్ట్రేలియా జట్టులో స్థానం కోల్పోవడానికి ఇది కారణం కావచ్చు. ఒక ఐపీఎల్ సీజన్ ఆధారంగా ఆటగాళ్లను అంచనా వేయడం తప్పు అని ఆస్ట్రేలియా నిరూపించింది.

Jake Fraser-McGurk: ఆస్ట్రేలియాకు బుద్ధి లేదని అనుకున్నాం..కానీ, మనకే లేదని అర్థమైంది!
Jake Fraser Mcgurk

Updated on: Apr 17, 2025 | 6:08 PM

జేక్ ఫ్రేజర్.. ఐపీఎల్‌ 2024లో అదరగొట్టిన ఈ కుర్రాడు, పాపం ఈ సీజన్‌లో ఎందుకనో తేలిపోతున్నాడు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి.. కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. అందులోనూ ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితం అయ్యాడు. అతను ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అతని స్కోర్లు ఒక సారి చూస్తే.. 1, 38, 0, 7, 0, 9 మాత్రమే. విధ్వంసకర బ్యాటింగ్‌తో గతేడాది అందరి దృష్టిని ఆకర్షించాడు ఫ్రేజర్‌. వామ్మో వీడేంటి ఇలా ఆడుతున్నాడు.. ఇక ఆస్ట్రేలియాకు మరో స్టార్‌ దొరికేశాడా? అంటూ చాలా మంది క్రికెట్‌ అభిమానులు అనుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు పవర్‌ ప్లేలో అదిరిపోయే ఆరంభాలు అందించాడు. లాస్ట్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు శివాలెత్తినట్లు ఆడటంతో ఫ్రేజర్‌ బ్యాటింగ్‌ పిల్లకాలువలా కనిపించింది. కానీ, చాలా విధ్వంసకరంగానే అతను కూడా ఆడాడు. దీంతో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ ఏడాది కూడా ఫ్రేజర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొంది.

కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఫ్రేజర్‌ దారుణంగా విఫలం అవుతున్నాడు. వరుస మ్యాచ్‌ల్లో విఫలం అవుతున్నా.. అదే అగ్రెసివ్‌ ఇంటెంట్‌ చూపిస్తూ.. తన వికెట్‌ పారేసుకుంటున్నాడు. ఫ్రేజర్‌ ప్రదర్శన విషయం పక్కనపెడితే.. ఈ కుర్రాడి విషయంలో మనం అంటే భారత క్రికెట్‌ అభిమానులు, అలాగే ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఎలా ఆలోచించాయి అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే.. మనం సోషల్‌ మీడియా హైప్‌కి, ఒక్క ఐపీఎల్‌ సీజన్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తామో అర్థం అవుతుంది. ఐపీఎల్‌ 2024 ఫ్రేజర్‌ ఆట చూసి.. ఆహా ఓహో అని అతన్ని ఆకాశానికి ఎత్తేశాం. వామ్మో ఇతను మామూలు ప్లేయర్‌ కాదు.. బౌలర్లుకు రాబోయే రోజుల్లో చుక్కలే, టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇతన్ని ఎవరైనా ఆపగలరా అంటూ సోషల్‌ మీడియాలో భారత క్రికెట్‌ అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. కానీ, తీరా చూస్తే.. ఆస్ట్రేలియా సెలెక్టర్లు ఇతన్ని కనీసం పట్టించుకోలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 స్క్వౌడ్‌లో ఫ్రేజర్‌కు స్థానం కల్పించలేదు. వాళ్ల స్క్వాడ్‌ చూసి.. మరోసారి ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు. వీళ్లకసలు మైండ్‌ ఉందా.. ఐపీఎల్‌లో దుమ్మురేపిన ఫ్రేజర్‌ను కాదని, ఫామ్‌లో లేని వార్నర్‌ను ఎంపిక చేస్తారా? అంటూ ఆసీస్‌ సెలెక్టర్లు కూడా తిట్టిపోశారు. యంగ్‌ టాలెంట్‌కు ఛాన్సులు ఇవ్వరు ఏం ఇవ్వరు.. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్‌ ఇలా తయారైందంటూ ఒకటే గోల. కానీ, ఏడాది తిరిగే సరికి.. ఒక్క ఏడాది ఊపు కాదు.. ప్రాసెస్‌ను నమ్మాలనే ఆస్ట్రేలియా క్రికెట్‌ సూత్రం కరెక్ట్‌ అనే విషయం అర్థమైంది.

ఒక్క ఐపీఎల్‌ సీజన్‌ ఆడినంత మాత్రనా నెత్తిన పెట్టుకోవడం సరైంది కాదని ఆస్ట్రేలియా నిరూపించింది. డొమెస్టిక్‌ క్రికెట్‌లో కన్సిస్టెంట్‌గా ఆడిన ప్లేయర్లకు మాత్రమే జాతీయ జట్టులో చోటు కల్పిస్తే.. మంచి ఫలితాలు ఆలస్యంగానైనా వస్తాయని, కానీ, టీ20 లీగ్స్‌లో చిత్రవిచిత్రమైన బ్యాటింగ్‌తో పాలపొంగులా పొంగితే కప్పులు రావని తెలిసొచ్చేలా చేసింది. అలా అని ఫ్రేజర్‌ జాతీయ జట్టులో పనికిరాడని కాదు. కానీ, బాల్‌ ఎలా వచ్చినా బాదేస్తా అంటూ ఇప్పటి బౌలర్లు అలా లేరు.. ఒక్క మ్యాచ్‌ బాగా ఆడితే, వీడియో ఎనాలసిస్‌తో బ్యాటర్ల ప్రతి కదలికను పసిగట్టేస్తున్నారు. వీక్‌నెస్ దొరికితే చాలు.. అదే వాళ్ల గేమ్‌ ప్లాన్‌ అయిపోతుంది. దాంతో.. ఎంతటి కొమ్ములు తిరిగిన బ్యాటర్‌నైనా ఇబ్బంది పెడుతున్నారు. ఫ్రేజర్‌ వీక్‌నెస్‌ ఓవర్‌ అగ్రెసివ్‌గా ఆడటమే. బాల్‌ ఎలా వచ్చినా గాల్లోకి ఆడాలనే చూస్తున్నాడు. దాంతో వికెట్‌ సమర్పించుకున్నాడు. ఐపీఎల్‌ మొత్తంలో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన ఫ్రేజర్‌ 14 సార్లు క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. ఇది చాలు అతను ఎంత గుడ్డిగా బాల్‌ను గాల్లోకి ఆడుతున్నాడో చెప్పేందుకు. ఇలా కేవలం అగ్రెషన్‌తోనే ఆడుతుంటే.. కష్టం అవుతుంది. ఇలా ఆడే ప్లేయర్లు ఒక సీజన్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు గెలిపిస్తారేమో కానీ, కన్సిస్టెంట్‌గా ఆడితేనే కప్పులు వస్తాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..