Watch : ధోనీ స్టైల్ ట్రై చేసి షాక్ తిన్నాడు.. చేతులారా ఈజీ రనౌట్ మిస్ చేసి తల పట్టుకున్న ఇషాన్

Watch : జింబాబ్వేతో రెండో టీ20లో ధోనీ స్టైల్‌లో రనౌట్ చేయాలని ప్రయత్నించిన ఇషాన్ కిషన్ సులభమైన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే బ్యాటింగ్‌లో 81 పరుగులతో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch : ధోనీ స్టైల్ ట్రై చేసి షాక్ తిన్నాడు.. చేతులారా ఈజీ రనౌట్ మిస్ చేసి తల పట్టుకున్న ఇషాన్
Ishan Kishan

Updated on: Jul 26, 2026 | 8:52 AM

Watch : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ శైలి ఎంతో ప్రత్యేకమైనది. వికెట్ల వెనుక బంతిని చూడకుండానే ఒకే చేత్తో స్టంప్స్ ఎగరగొట్టే అతని చాకచక్యం క్రికెట్ ప్రపంచంలోనే అరుదైనది. అయితే అలాంటి మెరుపు విన్యాసాలు చేయడం అంత సులువు కాదని నిరూపించే ఘటన జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో చోటుచేసుకుంది. 28 ఏళ్ల భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. ధోనీ శైలిని అనుకరిస్తూ అత్యంత సులువైన రనౌట్ అవకాశాన్ని చేతులారా జారవిడుచుకున్నాడు. ప్రస్తుతం ఈ విచిత్రమైన రనౌట్ మిస్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రవి బిష్ణోయ్ ఓవర్లో అసలేం జరిగింది?

జింబాబ్వే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ నవ్వు తెప్పించే సంఘటన జరిగింది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్ ఐదో బంతిని బ్యాటర్ తదివానాషే మారుమాని డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌ వైపు కొట్టి సింగిల్ తీశాడు. అయితే అతనితో ఉన్న నాన్-స్ట్రైకర్ న్యూమాన్ నియామ్హురి రెండో రన్ కోసం పిలుపునిచ్చి క్రీజు దాటి దాదాపు సగం దూరం వచ్చేశాడు. మారుమాని నో చెప్పడంతో, అప్పటికే క్రీజు వదిలేసిన నియామ్హురి వెనక్కి వెళ్లే సమయం లేక బౌలింగ్ వైపు ఉన్న క్రీజులోకి పరుగెత్తాడు. దాంతో ఇద్దరు జింబాబ్వే బ్యాటర్లు ఒకే వైపు నిలబడటంతో స్ట్రైకర్ వైపు ఉన్న క్రీజు ఖాళీగా మారిపోయింది.

అండర్‌ఆర్మ్ త్రో మిస్.. తల పట్టుకున్న కిషన్

ఫీల్డర్ నుంచి బంతి నేరుగా ఇషాన్ కిషన్ చేతుల్లోకి వచ్చింది. అతని ముందు బోలెడంత సమయం ఉంది. వికెట్ల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి చేతితో బెయిల్స్ పడగొట్టవచ్చు లేదా పక్కనే ఉన్న బౌలర్ బిష్ణోయ్‌కి బంతి అందించవచ్చు. కానీ ఇషాన్ క్రీజు దగ్గరకు వెళ్లకుండానే వికెట్ల వైపు చూడకుండా అండర్‌ఆర్మ్ త్రో విసిరాడు. బంతి నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకుతుందని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా బంతి వికెట్లకు పక్కగా వెళ్ళిపోయింది. ఈ వింతను చూసిన ఇషాన్ కిషన్ తీవ్ర నిరాశతో తన తల మీద చేయి పెట్టుకుని అవాక్కయ్యాడు.

నాదే పొరపాటు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అంగీకారం

మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఇషాన్ కిషన్ తన తప్పును ఒప్పుకున్నాడు. “సరిగ్గా ఆ సమయంలో బ్యాటర్ ఇప్పటికే క్రీజులోకి చేరుకున్నాడని నేను పొరబడ్డాను. త్రో వేసేటప్పుడు నా వైపు నుంచి పెద్ద పొరపాటు జరిగింది. మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తే కచ్చితంగా బెయిల్స్ వైపు చూసి సరైన విధంగా రనౌట్ చేస్తాను” అని ఇషాన్ నవ్వుతూ వివరణ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో మారుమాని 19 బంతుల్లో 24 పరుగులు చేయగా, ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ 19 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు.

కీపింగ్‌లో మిస్ అయినా.. బ్యాటింగ్‌లో హీరో

వికెట్ కీపింగ్‌లో చిన్న పొరపాటు చేసినప్పటికీ, బ్యాటింగ్ పరంగా ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో నిజమైన హీరోగా నిలిచాడు. కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు బాది జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ ఆల్‌రౌండ్ షోతో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్)తో కలిసి జట్టు స్కోరును 219 పరుగులకు చేర్చాడు. అనంతరం జింబాబ్వేను 129 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ఖాయం చేసుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us