
Abhishek Sharma : గౌహతిలోని బర్సాపరా స్టేడియం సాక్షిగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్‌తో చేసిన విధ్వంసానికి కివీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. అతను కొడుతున్న బాదుడు చూసి, అసలు ఆ బ్యాట్ కర్రతో చేసిందా లేక ఐరన్‌తో చేసిందా అన్న అనుమానం ప్రత్యర్థి ఆటగాళ్లకు కలిగింది. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత కివీస్ ఆటగాళ్లు స్వయంగా అభిషేక్ బ్యాట్‌ను చెక్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ చేసిన బ్యాటింగ్ విన్యాసాలు చూస్తుంటే.. స్టేడియంలో ఏదో సునామీ వచ్చిందా అన్నట్లు అనిపించింది. కేవలం 20 బంతుల్లోనే 68 పరుగులు బాదిన అతను, 340 స్ట్రైక్ రేట్‌తో కివీస్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఇందులో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్, భారత్ తరపున టీ20ల్లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అభిషేక్ శర్మ కొట్టిన ప్రతి షాట్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండటంతో కివీస్ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. బంతి బ్యాట్‌కు తగిలితే చాలు నేరుగా బౌండరీ అవతలే పడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ నేరుగా అభిషేక్ దగ్గరకు వెళ్లి అతని బ్యాట్‌ను పరీక్షించారు. ఆ బ్యాట్ బరువు ఎంత ఉంది? అది అంత పవర్‌ఫుల్ ఎలా ఉంది? అని వారు ఆశ్చర్యంగా చూడటం కెమెరాలకు చిక్కింది. అభిషేక్ తన బ్యాట్‌ను వారికి చూపిస్తూ నవ్వుతూ సరదాగా ముచ్చటించాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
Abhishek Sharma🙌
The monster from India❤️🔥 pic.twitter.com/kwlnDEDhNC— Vishwas_Bajwa (@Singh_King___) January 26, 2026
అసలు మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా (3 వికెట్లు), రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి కివీస్‌ను కట్టడి చేశారు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయి షాక్ తగిలినా, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేశారు.
సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, భారత్ కేవలం 10 ఓవర్లలోనే 158 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. అంటే ఇంకా సగం ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా ఘనవిజయం సాధించి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ చూపించిన ఈ అరాచకానికి కివీస్ బౌలర్లు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఈ విజయంతో భారత జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..