
Vaibhav Suryavanshi: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 21 బంతుల్లోనే 46 పరుగులు చేసి క్రీజులో ప్రమాదకరంగా మారిన తరుణంలో, ఢిల్లీ క్యాపిటల్స్ అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ మాధవ్ తివారీ వేసిన ఒక అద్భుతమైన స్లో డెలివరీకి సూర్యవంశీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్ పడిన తీరుపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా స్పందిస్తున్నారు. పేస్ తగ్గించి బంతులు వేస్తే ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్ తడబడుతున్నాడనే ప్రచారం మొదలైంది.
మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ విమర్శలను పూర్తిగా కొట్టిపారేశారు. “ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కారు. ప్రతి ఆటగాడికి ఏదో ఒక చోట చిన్న బలహీనత ఉంటుంది. అంత మాత్రానికే స్లో బంతులు ఆడటం వైభవ్ బలహీనత అని నేను అనుకోను. ప్రత్యర్థి బౌలర్లు ఆ వ్యూహాన్ని ప్రయత్నించాలనుకుంటే నిరభ్యంతరంగా ప్రయత్నించుకోవచ్చు” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. ఢిల్లీ వికెట్ స్వభావాన్ని బట్టి చూస్తే, బంతి కాస్త గ్రిప్ అవుతున్నప్పుడు ఏ అగ్రశ్రేణి బ్యాటర్ అయినా సరే వేగం తగ్గించి వేసే బంతులకు ఇబ్బంది పడటం సహజమని ఆయన సమర్థించారు.
సూర్యవంశీ ప్రతిభపై కోచ్ రాథోడ్‌కు పూర్తి నమ్మకం ఉంది. “అతను చాలా ప్రత్యేకమైన ఆటగాడు. అతని సామర్థ్యం ఎలాంటిదో ఇప్పటికే అందరికీ అర్థమైంది. జట్టుకు కావాల్సిన మంచి ఆరంభాన్ని అతను ఇస్తున్నాడు. త్వరలోనే అతను ఈ మెరుపు ఇన్నింగ్స్‌ను ఒక భారీ శతకంగా లేదా భారీ స్కోరుగా మారుస్తాడని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఇదే సమయంలో, ధ్రువ్ జురెల్ లాగా వైభవ్ కూడా క్రీజులో ఎక్కువ సమయం గడపడంపై దృష్టి పెట్టాలా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “ఒక్కో ఆటగాడికి ఒక్కో శైలి ఉంటుంది. ధ్రువ్ లాగా వైభవ్ ఆడాల్సిన పనిలేదు, వైభవ్ లాగా ధ్రువ్ ఆడనక్కర్లేదు. తమ సొంత బలాలను నమ్ముకుని ఆడితే ఎవరైనా విజయం సాధిస్తారు” అని స్పష్టం చేశారు.
ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తుది జట్టులో లేకపోవడంపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై కెప్టెన్ రియాన్ పరాగ్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అని చెప్పగా, కోచ్ విక్రమ్ రాథోడ్ అసలు కారణాన్ని వెల్లడించారు. జడేజా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, అందుకే అతనికి ఈ మ్యాచ్‌లో విశ్రాంతిని ఇచ్చామని తెలిపారు. ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారిన వేళ, జడేజా తదుపరి మ్యాచ్‌లలో పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులోకి రావడం జట్టుకు ఎంతో అవసరమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడును కొనసాగిస్తూనే, విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని రాజస్థాన్ అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..