IPL 2026 Playoffs: ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌కు సిద్ధమైన ఆ రెండు టీంలు..!

IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. పది జట్లలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించగా, మిగిలిన 8 జట్లు టాప్-4 కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న సమీకరణాలు, జట్ల అర్హత అవకాశాలను ఓసారి చూద్దాం..

IPL 2026 Playoffs: ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌కు సిద్ధమైన ఆ రెండు టీంలు..!
Ipl 2026 Playoffs

Updated on: May 15, 2026 | 3:16 PM

IPL 2026 Playoffs: ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరడానికి అడుగు దూరంలో ఉంది. మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే 20 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, క్వాలిఫైయర్-1 ఆడే అవకాశం పొందుతుంది. ఒకవేళ ఒక మ్యాచ్ ఓడిపోయినా, మెరుగైన నెట్ రన్ రేట్ (+1.053)తో టాప్-2లో నిలబెట్టే అవకాశం ఉంది.

గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం..

వరుసగా ఐదు విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లతో పటిష్ట స్థితిలో ఉంది. వీరు తమ తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే నేరుగా అగ్రస్థానానికి చేరుకుంటారు. అయితే, ఒకవేళ రెండింటిలోనూ ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ పరిస్థితి..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. మరోవైపు పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదు ఓటములతో ఇబ్బందుల్లో పడింది. 13 పాయింట్లతో ఉన్న పంజాబ్, తమ మిగిలిన మ్యాచ్‌లు గెలిచినా గరిష్టంగా 17 పాయింట్లకే చేరుకుంటుంది. దీంతో ఇతర జట్ల ఓటములపైనే పంజాబ్ ఆశలు నిలిచాయి.

చెన్నై, రాజస్థాన్ జట్ల పోరాటం..

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ చెరో 12 పాయింట్లతో రేసులో ఉన్నాయి. చెన్నై తమ మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి 18 పాయింట్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా తమ అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు అగ్రస్థానంలో ఉన్న జట్లు పాయింట్లు కోల్పోవాలని కోరుకుంటున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్..

ఢిల్లీ క్యాపిటల్స్ (10 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (9 పాయింట్లు) ఆశలు తక్కువగా ఉన్నప్పటికీ సాంకేతికంగా ఇంకా రేసులోనే ఉన్నాయి. ఢిల్లీ తమ మిగిలిన మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలవడమే కాకుండా, పంజాబ్, చెన్నై జట్లు తమ అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాలని ప్రార్థించాలి. కోల్‌కతా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది; వారు ప్రతి మ్యాచ్ గెలిచి అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us