
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల అబుదాబిలో జరిగిన వేలం పాటలో కొందరు ఆటగాళ్లు కోట్ల రూపాయల ధర పలికి వార్తల్లో నిలిస్తే, మరికొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. అయితే వేలంలో అమ్ముడుపోనంత మాత్రాన ఐపీఎల్ ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని బీసీసీఐ స్పష్టం చేస్తోంది. అమ్ముడుపోని ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా RAPP (Registered Available Player Pool) పేరుతో ఒక జాబితాను సిద్ధం చేసింది. ఇందులో ఏకంగా 1307 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. అసలు ఈ RAPP అంటే ఏమిటి? ఇందులో ఉన్న స్టార్ ప్లేయర్లు ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ అంటేనే అన్-ప్రిడిక్టబుల్. ఎప్పుడు ఎవరి దశ మారుతుందో ఎవరూ చెప్పలేరు. గతేడాది డిసెంబర్ 16న అబుదాబిలో జరిగిన మెగా వేలంలో ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే చాలా మంది టాలెంటెడ్ ఆటగాళ్లు ఏ జట్టుకూ ఎంపిక కాలేదు. ఇలాంటి వారి కోసం బీసీసీఐ రిజిస్టర్డ్ అవైలబుల్ ప్లేయర్ పూల్‌ను రూపొందించింది. వేలం కోసం తమ పేర్లను నమోదు చేసుకుని, చివరి నిమిషం వరకు తప్పుకోకుండా ఉన్న ఆటగాళ్లను మాత్రమే ఈ పూల్‌లో ఉంచుతారు. టోర్నీ జరుగుతున్న సమయంలో ఏదైనా జట్టులోని ఆటగాడు గాయపడితే లేదా వ్యక్తిగత కారణాలతో వైదొలిగితే, ఫ్రాంచైజీలు ఈ RAPP జాబితా నుండే ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
లిస్ట్‌లో ఉన్న స్టార్ ప్లేయర్లు వీళ్లే
ఈసారి RAPP జాబితాలో విదేశీ దిగ్గజాలు ఉండటం విశేషం. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ బౌలర్ రీస్ టాప్లీ, జేమీ స్మిత్, జానీ బెయిర్‌స్టో వంటి పేరున్న ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. ముఖ్యంగా టీమిండియాను తన బ్యాటింగ్‌తో భయపెట్టే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ 98వ నంబర్‌తో ఈ పూల్‌లో ఉన్నాడు. ఇతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన మిచెల్‌ను ఏ ఫ్రాంచైజీ అయినా రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారత ఆటగాళ్ల పరిస్థితి ఏంటి?
కేవలం విదేశీయులే కాదు, మన దేశానికి చెందిన స్టార్ ఆటగాళ్లు కూడా ఈ నిరీక్షణ జాబితాలో ఉన్నారు. మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్, దీపక్ హుడా, నవదీప్ సైనీ, చేతన్ సకారియా, సందీప్ వారియర్, వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ వంటి వారు రూ.75 లక్షల బేస్ ప్రైస్‌తో RAPP లిస్ట్‌లో ఉన్నారు. ఐపీఎల్ సుదీర్ఘ టోర్నీ కావడంతో పేస్ బౌలర్లకు గాయాలయ్యే అవకాశం ఎక్కువ. అప్పుడు నవదీప్ సైనీ లేదా ఉమేష్ యాదవ్ వంటి అనుభవం ఉన్న బౌలర్లకు డిమాండ్ పెరగవచ్చు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక ఫ్రాంచైజీ ఈ జాబితాలోని ఆటగాడిని తీసుకోవాలనుకుంటే, వేలంలో అతను నిర్ణయించుకున్న బేస్ ప్రైజ్ కంటే తక్కువ ఇవ్వడానికి వీల్లేదు. అంటే డారిల్ మిచెల్‌ను తీసుకోవాలంటే కనీసం రూ.2 కోట్లు చెల్లించాల్సిందే. కొన్నిసార్లు ఫ్రాంచైజీలు ఈ ఆటగాళ్లను నెట్ బౌలర్లుగా పిలిపించుకుంటాయి. అయితే, నెట్ బౌలర్‌గా ఉన్నంత మాత్రాన ఆ ఆటగాడు ఆ జట్టుకు చెందినవాడు అని అర్థం కాదు. ఒకవేళ వేరే ఫ్రాంచైజీ అతడిని అధికారికంగా రిప్లేస్‌మెంట్‌గా కోరుకుంటే, సదరు ఆటగాడు వెళ్లి ఆ జట్టులో చేరిపోవచ్చు. మొత్తం మీద 1307 మంది పేర్లతో కూడిన ఈ భారీ జాబితా.. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఎంతో మందికి లక్కును తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..