
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం జరగుంది. అబుదాబీ వేదికగా జరిగే ఈ ఆక్షన్ కోసం రంగం సిద్దం చేస్తున్నారు. పది ఫ్రాంచైజీలలో మొత్తంగా 77 స్లాట్లు అందుబాటులో ఉండగా.. ఈ వేలంలో టీ20 ఫార్మాట్ స్పెషలిస్టులపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు విదేశీ క్రికెటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతారని అంచనా. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ టాప్ ప్లేస్‌లో ఉండే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్ గతంలో ఐపీఎల్ రెండు సీజన్లు ఆడాడు. 153.69 స్ట్రైక్ రేట్‌తో 707 పరుగులు చేశాడు. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున.. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగాడు. అలాగే బంతితో 16 వికెట్లు తీశాడు. దీంతో కామెరూన్ గ్రీన్ భారీ ధరను దక్కించుకునే అవకాశం ఉంది.
ఐపీఎల్ వేలంలో హాట్ కేక్‌గా మారబోతున్న మరో ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. 22 ఏళ్ల ఈ యువ ఆస్ట్రేలియా ప్లేయర్ 2024లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను 234కు పైగా స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఎక్స్‌ప్లోసివ్ పవర్ ప్లే హిట్టర్ కావాలనుకునే ఫ్రాంచైజీలు జేక్ ఫ్రేజర్‌పై దృష్టి సారించడం ఖాయం. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ పైన కూడా అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు. టీ20లలో మ్యాట్ హెన్రీ ఎకానమీ రేటు 8.22 కాగా, యావరేజ్ 22.74గా ఉంది. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. టీ20 కెరీర్‌లో 145కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఫినిషర్ కోసం చూస్తున్న జట్లకు లివింగ్‌స్టోన్ ఒక మంచి ఆప్షన్. శ్రీలంక పేసర్ మతీస పతిరాన పైన కూడా ఫ్రాంచైజీల ఫోకస్ పెట్టాయి. 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ యువ బౌలర్ 19 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి