ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం ప్రక్రియకు సమయం దగ్గరపడుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. తాజాగా IPL 2025 ఎడిషన్ కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాను BCCI వెల్లడించింది. IPL 2025 ఎడిషన్ కోసం మెగా వేలం రంగంలో ఉన్న కొంతమంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి టాప్ ఫైవ్ స్టార్ ప్లేయర్స్ గురించిన పూర్తి సమాచారం ఇదిగో.
ఈసారి ఐపీఎల్ వేలం ప్రక్రియలో జేమ్స్ అండర్సన్ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో అండర్సన్ ఐపీఎల్ వేలం కోసం నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి. ఇటీవలే రిటైరైన టెస్ట్ స్పెషలిస్ట్ అయిన అండర్సన్, జూలై 2024లో లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అండర్సన్ ఇప్పుడు తన బేస్ ధరను రూ.1.25 కోట్లకు పెంచాడు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ వేలంలో తన పేరును ఉంచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా నుండి వార్నర్ తొలగించబడ్డాడు. ఐపీఎల్‌లో వార్నర్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు (663) బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అలాగే, అతను అత్యధిక అర్ధ సెంచరీలు (66) తన పేరిట ఉన్న రికార్డును కలిగి ఉన్నాడు. 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ట్రోఫీని అందించిన కెప్టెన్.
2022 నుండి 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి నాయకత్వం వహించిన కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, రాబోయే ఎడిషన్ కోసం ఫ్రాంచైజీ అతడిని కొనసాగించలేదు. ఫాఫ్ గత రెండు ఎడిషన్లలో RCB జట్టుకు చాలా సహకారం అందించాడు. IPL 2024లో, RCB అతని నాయకత్వంలో వరుసగా 7 విజయాలతో ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది.
ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఐపిఎల్‌లో అరంగేట్రం చేశాడు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమయ్యాడు. 2023లో CSK ఐదో ఐపీఎల్ టైటిల్ గెలవడంలో అలీ కీలకపాత్ర పోషించాడు. కానీ CSK IPL 2025 టోర్నమెంట్ కోసం అలీని రిటైన్ చేయలేదు. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 67 మ్యాచ్‌లు ఆడి 1162 పరుగులు చేశాడు. మొయిన్ అలీకి ఐపీఎల్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లలో కూడా అపారమైన అనుభవం ఉంది.
ప్రమాదకరమైన స్వింగ్ బౌలర్లలో ఒకరైన న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి దూరమయ్యాడు. పవర్‌ప్లే ఓవర్లలో బౌల్ట్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు మెగా వేలంలో కనిపించిన బౌల్ట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. టీమ్ ఇండియా ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తర్వాత, పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు (63) తీసిన బౌలర్‌గా బౌల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 104 మ్యాచ్‌లు ఆడిన బోల్ట్ 121 వికెట్లు పడగొట్టాడు.