Bengaluru Stampede: మాటలు రావడం లేదు..: విరాట్ కోహ్లీ

ఆర్‌సిబికి చారిత్రక విజయం లభించిన రోజున ఈ విషాద ఘటన జరగడం పట్ల క్రీడా లోకంలో, అభిమానుల్లో తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. భద్రతా ఏర్పాట్లపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి భారీ కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్ల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది.

Bengaluru Stampede: మాటలు రావడం లేదు..: విరాట్ కోహ్లీ
Bengaluru Stampede Kohli Reaction

Updated on: Jun 04, 2025 | 11:51 PM

Virat Kohli Reaction Bengaluru Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసిన ఆనందం విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా, 33 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆర్‌సిబి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సుదీర్ఘకాలంగా ఆర్‌సిబి అభిమానులు ఎదురుచూస్తున్న కలను నిజం చేస్తూ, 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ఆర్‌సిబి జట్టు బెంగళూరు చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. అయితే, ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది అభిమానులు తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. సుమారు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు గుమిగూడగా, స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మాత్రమే. గేట్ల వద్ద తొక్కిసలాట జరిగి, 11 మంది దుర్మరణం పాలయ్యారు.

ఈ విషాద ఘటనపై విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. “మాటలు రావడం లేదు. పూర్తిగా షాక్ అయ్యాను,” అని ఆయన రాశారు. ఆర్‌సిబి విడుదల చేసిన అధికారిక ప్రకటనను కూడా ఆయన తన పోస్ట్‌లో షేర్ చేశారు. “బెంగళూరులో జరిగిన ఈ దురదృష్టకర సంఘటనల గురించి మీడియా నివేదికల ద్వారా తెలుసుకుని మేము తీవ్ర ఆవేదన చెందుతున్నాం. ప్రజల భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్‌సిబి సంతాపం తెలియజేస్తుంది. ప్రభావిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితి గురించి తెలిసిన వెంటనే, మేం మా కార్యక్రమాన్ని వెంటనే మార్చుకుని, స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించాం. మా మద్దతుదారులందరూ దయచేసి సురక్షితంగా ఉండాలని కోరుతున్నాం,” అని ఆర్‌సిబి తమ ప్రకటనలో పేర్కొంది.

తొక్కిసలాట జరిగినప్పటికీ, స్టేడియం లోపల కొద్దిసేపు విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పాటిదార్,  విరాట్ కోహ్లీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, బయట జరిగిన విషాదం గురించి తెలియగానే, వేడుకలను రద్దు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశించారు.

ఆర్‌సిబికి చారిత్రక విజయం లభించిన రోజున ఈ విషాద ఘటన జరగడం పట్ల క్రీడా లోకంలో, అభిమానుల్లో తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. భద్రతా ఏర్పాట్లపై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి భారీ కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్ల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసింది.

సచిన్ ఏమన్నాడంటే..

ఈ దుర్ఘటనపై టీమిండియా లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా స్పందించారు. ఎంతో బాధకరమంటూ సోసల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంఘటన విషాదకరమైనది. ప్రతి ప్రభావిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అందరికీ శాంతి, బలం కలగాలని కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..